రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో నెలకొన్న పలు రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో కె. చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవిలతో కలిసి రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్లు వారి మండలాల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇళ్లస్థలాలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం ఇళ్లస్థలాలు మంజూరు చేయాలన్నారు. తహసీల్దార్లు, వీఆర్వోలు, సర్వేయర్లతో కలిసి ప్రస్తుతం జిల్లాలో ఉన్న లేఅవుట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఖాళీలను గుర్తించాలన్నారు.
నిర్లక్ష్యం వద్దు..
పొలాలు, ఇళ్లస్థలాలు సర్వే చేయాలని అర్జీ పెట్టుకున్న దరఖాస్తుదారుల విషయంలో నిర్లక్ష్యం సరికాదని కలెక్టర్ అన్నారు. సర్వేయర్లు ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పనిచేయాలన్నారు. ‘మీ కోసం’ అర్జీలు రీ–ఓపెన్ అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ధాన్యం సేకరణ సమయం ఆసన్నమైనందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఆర్డీవోలు కె. స్వాతి, జి. బాలసుబ్రహ్మణ్యం, బీఎస్ హేలా షారోన్, సర్వే ఏడీ జోషీలా తదితరులు పాల్గొన్నారు.


