విద్యార్థి ఉసురు తీసిన బెట్టింగ్ వ్యసనం
మైలవరం: బెట్టింగ్‌లతో అప్పులపాలై మనస్తాపంతో హాస్టల్‌లో రూమ్‌లో ఉరి వేసుకుని ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మైలవరంలో బుధవారం జరిగింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవరపల్లికి చెందిన గొర్రె అరవింద్(23) ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. అతను స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉంటున్నాడు. కొంత కాలంగా ఆన్‌లైన్‌లో బెట్టింగులకు అలవాటు పడ్డాడు. బెట్టింగుల కోసం స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. అప్పులు చెల్లించలేక బుధవారం కాలేజీకి వెళ్లకుండా రూమ్‌లోనే ఉండి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. కళాశాల నుంచి తిరిగి హాస్టల్‌కు వచ్చిన అతని స్నేహితులకు అరవింద్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని వారు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మైలవరం: పురుగు మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని పుల్లూరు పంచాయతీ శివారు సీతారామపురం తండాలో జరిగింది. సీతారామపురం తండాకు చెందిన బాణావతు భిక్షాలు, బుజ్జి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. నలుగురు కుమార్తెలకు వివాహాలయ్యాయి. పెద్ద కుమారుడు జమలయ్య (22) ఈ ఏడాది మార్చిలో ఎ.కొండూరు మండలం కుమ్మరికుంట తండాకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకు న్నాడు. దీపావళి పండుగకు అత్తగారింటికి వెళ్లొచ్చిన అనంతరం మంగళవారం సాయంత్రం తండాకు సమీపంలో ఉన్న అటవీ భూముల్లో పురుగు మందు తాగి బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న జమలయ్యను మైలవరం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం ఉదయం జమలయ్య మృతి చెందా డని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జి.కొండూరు: మండలంలోని కవులూరు పోస్టాఫీసులో మహిళా పోస్టుమాస్టర్ చేతివాటం ప్రదర్శించి ఖాతాదారుల సొమ్మును స్వాహాచేసిన ఘటనపై ఉన్నతాధికారుల విచారణ బుధవారం కొనసాగింది. ఖాతాదారులను పోస్టాఫీసుకు పిలిపించిన అధికారులు వారి నగదు లావాదేవీలను నమోదు చేశారు. నిధుల గోల్‌మాల్ అంశంపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పోస్టాఫీసు వద్దకు చేరుకున్నారు. ఖాతాదారుల్లో ఎక్కువ శాతం కూలిపనులు చేసుకునే పేదలే. ఆడబిడ్డల భవిష్యత్తు అవసరాల కోసం సుకన్య సమృద్ధి పథకంలో డిపాజిట్‌లు చేస్తున్న వారు ఉన్నారు. ఎనిమిది నెలలుగా పక్కా వ్యూహంతో పోస్టుమాస్టర్ ఖాతాదారుల నిధులు గోల్‌మాల్ చేసినట్లు సమాచారం. రెండో రోజు విచారణ పూర్తయ్యే సమయానికి రూ.6 లక్షల వరకు గోల్‌మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారని తెలిసింది. ఉన్నతాధికారుల విచారణ మరో వారం రోజులు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. నిధుల స్వాహా నేపథ్యంలో తమ పథకాలు కొనసాగుతాయా లేదా అని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. నిధుల గోల్‌మాల్ అంశం బయటకు పొక్కడంతో పోస్టు మాస్టర్ రూ.2 లక్షల మేర ఇప్పటికే కొంత మంది ఖాతాదారులకు చెల్లించి, మరో రూ.2 లక్షలను కొండపల్లి సబ్ పోస్టాఫీసులో డిపాజిట్ చేసినట్లు సమాచారం. పోస్టుమాస్టర్‌పై కేసు నమోదు చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారని తెలిసింది.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమ స్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. పీజీఆర్‌ఎస్, అందరికీ ఇళ్లు అంశాలపై భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ కలెక్టర్ ఇలక్కియతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్ అర్జీల్లో అపరిష్కృతంగా ఉన్నవాటి వివరాలు శాఖల వారీగా, మండలాల వారీగా తెలపాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దని ఆదేశించారు. భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కీలక ప్రగతి సూచికల్లో (కేపీఐ) ఐసీడీఎస్, పోలీస్ శాఖల అంశాలలో పురోగతి ఉండాలన్నారు. ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ లక్ష్మీనరసింహం, కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక డెప్యూటీ కలెక్టర్ ఎ.పోసిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ కుమారి, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీఎస్‌ఎల్‌ఓ వై.మోహన్‌రావు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థి ఉసురు తీసిన బెట్టింగ్ వ్యసనం
విద్యార్థి ఉసురు తీసిన బెట్టింగ్ వ్యసనం
విద్యార్థి ఉసురు తీసిన బెట్టింగ్ వ్యసనం


