పసిపాప ప్రాణం కాపాడిన లెప్రసీ అధికారి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): బిస్కెట్ తింటున్న రెండేళ్ల బాలిక అనూహ్యంగా అపస్మారక స్థితిలోకి చేరుకున్న సంఘటన కొండపల్లిలో శనివారం జరిగింది. బాలిక తల్లి భవానీ హుటాహుటినా బాలికను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చింది. ఆ సమయంలో వైద్యశాల తనిఖీకి వచ్చిన జిల్లా లెప్రసీ, టీబీ అధికారి భాను నాయక్ బాలిక పరిస్థితిని గమనించారు. బాలిక గొంతులోకి వెళ్లాల్సిన బిస్కెట్ ముక్కలు ఊపిరి తీసుకునే నాళాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. తక్షణం బాలికను తలకిందులగా వేలాడదీసి గొంతులో ఇరుక్కుపోయిన బిస్కెట్ ముక్కలు బయటకు వచ్చేలా చేశారు. మెదడు భాగానికి ఆక్సిజన్ అందకపోవడం వలన అపస్మారక స్థితికి చేరుకున్నట్లు గుర్తించారు. వెంటనే ఆక్సిజన్ పెట్టి విజయవాడ ప్రభుత్వ వైద్యశాల చిన్నపిల్లల వార్డుకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. బాలికలకు సపర్యలు చేసిన వారిలో స్థానిక వైద్యుడు రాథోడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మురుగు కాల్వలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపూడి అట్కిన్‌సన్ స్కూల్ ఉత్తరం వైపు ప్రహరీ పక్కన మురుగు కాల్వలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు 50 సంవత్సరాలు ఉంటాయి. ఒంటిపై బ్లూ కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్ ఉంది. శవం ఉబ్బిపోయి ఉంది. మృతుని వివరాలు తెలియలేదు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు మురుగు కాల్వలో పడి ఉంటాడని, ఘటన రెండు రోజుల కిందట జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గొల్లపూడి వీఆర్వో జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.


