కేయూలో ఫ్రెషర్స్ డే వేడుకలు
కోనేరుసెంటర్: కృష్ణా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో కొత్తగా వచ్చిన విద్యార్థులకు ఆహ్వానం పలుకుతూ గురువారం ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వీసీ ఆచార్య కె.రాంజీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు వికాసం కూడా తప్పనిసరి అన్నారు. విద్యార్థులు కాలంతో పోటీపడి ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవ్వాలని సూచించారు. రెక్టార్ ఆచార్య ఎం.వి.బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష, ఇంజినీరింగ్ కళాశాల డీన్ ఆచార్య వై.కె. సుందరకృష్ణ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.విజయకుమారి ప్రసంగించారు. ఆటపాటలు, డ్యాన్స్‌లతో విద్యార్థులు సందడి చేశారు.
కంచికచర్ల: ఆర్డీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తమపై దురుసుగా ప్రవర్తించిందని డ్రైవర్, కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన ఓ మహిళ జగ్గయ్యపేట డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సును విజయవాడలో ఎక్కింది. ఆమె పరిటాలలో దిగాల్సి ఉంది. ఆమె బస్సు ఎక్కి ఫుట్‌పాత్‌పై నిల్చుంది. గమనించిన డ్రైవర్ ఆమెను లోపలికి వెళ్లమని సూచించాడు. దీనిపై ఆమె డ్రైవర్‌పై గొడవకు దిగింది. ఎందుకమ్మా డ్రైవర్‌పై గొడవ పడతున్నావన్న కండక్టర్‌పైనా ఆమె మండిపడింది. ఇద్దరు కలసి తనను మందలిస్తారా.. ఇది ఫ్రీ బస్సు.. నా ఫొటో తీసుకో.. ఈ ఫొటోను విజయవాడ సిటీలో లేదా చిల్లకల్లు, కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి చూపించుకో.. నా ఫొటో చూడగానే పోలీసులకే దడ పుడుతుందంటూ కండక్టర్‌పై దురుసుగా ప్రవర్తించింది. ‘అమ్మా కండక్టర్ అయ్యప్ప మాల ధరించాడు అతనిపై దుర్భాషలాడకూడదు’ అని హితవు పలికిన తోటి మహిళలను కూడా దుర్భాషలాడింది. బస్సు డ్రైవర్ పరిటాల గ్రామంలో బస్సును ఆపకుండా నేరుగా కంచికచర్ల పోలీస్‌స్టేషన్ వద్ద బస్సు ఆపి మహిళపై ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ విశ్వనాథ్ మహిళను మందలించి కండక్టర్, డ్రైవర్‌లకు సర్ది చెప్పి పంపించి వేశారు.
ఉంగుటూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ముసిముక్కు కనకచింతయ్య, అతని భార్య సీతామహాలక్ష్మి(42) వ్యవసాయ సనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే పక్కపక్కనే నివాసిస్తున్న కనకచింతయ్యకు, అతని సోదరుడైన వడ్డీకాసులకు గత కొంత కాలంగా దారి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ విషయమై రెండు నెలలు క్రితం వీరి మధ్య జరిగిన గొడవలో సీతామహాలక్ష్మిపై దాడిచేసి కొట్టారు. ఈ ఘటనపై అప్పట్లో ఉంగుటూరు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ వివాదం సమసిపోలేదు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో సీతామహాలక్ష్మి సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అప్పటికే ఆమె మృతి చెందడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వడ్డీకాసులు కుటుంబ సభ్యులే సీతామహాలక్ష్మిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి భర్త కనకచింతయ్య, కుమారుడు రాజేష్ ఆరోపిస్తున్నారు. గతంలో ఆమైపె దాడి జరిగినప్పుడు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికి, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.


