సులభమైన పద్ధతుల్లో బోధించాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
పామర్రు: చిన్న చిన్న పరికరాలతో ప్రయోగాత్మకంగా భౌతిక శాస్త్రాన్ని అర్థమయ్యే రీతిలో వివరించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రమైన పామర్రులోని ప్రగతి విద్యా సంస్థలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు క్యాంటం కంప్యూటర్స్‌పై ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీ దేవి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నిజ జీవితంలో భౌతిక శాస్త్రం మనకు ఏ విధంగా అన్వయించుకోవచ్చు తెలియజేస్తే విద్యార్థుల్లో చైతన్యవంతం అవుతారన్నారు. మనం తరగతులు నిర్వహిస్తే విద్యార్థులు బాగా అర్థం చేసుకోగలరు అనే నమ్మకం ఉపాధ్యాయులకు ఉండాలన్నారు. ఉపాధ్యాయులు అందరూ క్వాంటం కంప్యూటర్ అవగాహన పెంపొందించుకుని విద్యార్థులకు వివరించి, జ్ఞానవంతులను చేయాలని కోరారు. రాష్ట్ర సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి బి. సుందర్ విజయవాడ నుంచి వర్చువల్‌గా పాల్గొని క్వాంటం కంప్యూటింగ్ గురించి కూలంకషంగా వివరించారు. సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, జిల్లా విద్యాశాఖ అధికారి పి. విజయ రామారావు, ఉప విద్యాధికారి పద్మ రాణి, ప్రగతి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు, నాగ మల్లేశ్వరి పాల్గొన్నారు.


