
దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. రాజగోపురం ఎదుట కళావేదికపై జరిగిన ఈ కర్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా బొర్రా రాధాకృష్ణ(గాంధీ), 15 మంది సభ్యులు, ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్‌అఫీ షియో సభ్యుడితో ఆలయ ఈఓ శీనానాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యురాలు పద్మా వతి ఠాకూర్ వ్యక్తిగత కారణాలతో హాజరుకావడంలేదని దేవస్థానానికి సమాచారమిచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం మహా మండపంలోని చైర్మన్ చాంబర్‌లో ట్రస్ట్‌బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. చైర్మన్ దంపతులతో పాటు పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ట్రస్ట్ బోర్డు సభ్యులు వీరే..
ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అవ్వారు శ్రీనివాసరావు (బుల్లబ్బాయ్), బడేటి ధర్మారావు, గూడపాటి వెంకట సరోజినీదేవి, జి.వి.నాగేశ్వరరావు, జి.హరి కృష్ణ, జింకా లక్ష్మీదేవి, మన్నె కళావతి, పనబాక భూలక్ష్మి, మోరు శ్రావణి, పెనుమత్స రాఘవరాజు, ఏలేశ్వరపు సుబ్రహ్మణ్యకుమార్, సుకాశి సరిత, తంబ ళ్లపల్లి రమాదేవి, తోటకూర వెంకట రమణారావు, తరిగొప్పల పార్వతి, ప్రత్యేక ఆహ్వానితులుగా వెలగపూడి శంకరబాబు, మార్తి రామబ్రహ్మం ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధానార్చకుడు ఎల్.దుర్గాప్రసాద్ ఉన్నారు. కోడలి హత్య కేసులో నిందితురాలు తరిగొప్పల పార్వతితో బోర్డు సభ్యురాలిగా ప్రమాణం చేయడం, వేద ఆశీర్వచనం అందించడంపై విమర్శలు వచ్చాయి.
తొలి రోజే వివాదాలు
ప్రమాణ స్వీకారం అనంతరం మహామండపం ఆరో అంతస్తులో చైర్మన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఈఓ శీనానాయక్ అక్కడికి వచ్చారు. మీడిమా సమావేశం ఉందని ఎందుకు చెప్పలేదని సిబ్బందిపై ఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే సుజనా చౌదరి అక్కడి నుంచి వెనుతిరగడంతో ఆయనను పంపేందుకు ఈఓ వెళ్లారు. ఈఓ అసంతృప్తిని ఆలయ సిబ్బంది చైర్మన్ గాంధీకి చెప్పడంతో ఆయన రాక కోసం పది నిమిషాలు ఎదురు చూశారు. ఈఓ వచ్చాక సమావేశాన్ని మొక్కుబడిగా ముగించారు. ఈఓ, చైర్మన్ వెనుక చైర్మన్ కుమారుడు కుర్చీ వేసుకుని కూర్చో వడం వివాదాస్పదమైంది. ప్రమాణస్వీకారానికి వచ్చిన చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యుల బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు అమ్మవారి దర్శనానికి వెళ్లడంతో వీఐీపీ, రూ.500, రూ.300 టికెట్ల క్యూ లైన్లు గంట పాటు నిలిచాయి. ప్రమాణ స్వీకారం నేప థ్యంలో అంతరాలయ దర్శనాన్ని దేవస్థానం రద్దు చేసింది. రూ.500 టికెట్ల విక్రయాలు నిలిపి, వీఐపీలు, ట్రస్ట్‌బోర్డు కుటుంబ సభ్యులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. అంతరాలయ దర్శనం కల్పించకపోవడంపై హైదరాబాద్, బెంగళూరు వంటి దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.