
సారూ...మా కాలనీ రోడ్లు బాగు చేయండి!
జి.కొండూరు: ‘‘సారూ...మా కాలనీలో రోడ్లు అధ్వానంగా మారి కాలు బయట పెట్టలేకపోతున్నాం. మురుగునీరు పోయే దారిలేక ఇళ్ల మధ్యలోనే నిలుస్తున్నాయి. ఈగలు, దోమలతో నరకయాతన పడుతున్నాం’’ అంటూ జి.కొండూరు జగనన్న కాలనీ వాసులు కలెక్టర్ లక్ష్మీశ వద్ద సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులకు కీస్ హ్యాండోవర్ ప్రోగ్రాం నిర్వహణ కోసం జి.కొండూరు జగనన్న కాలనీని కలెక్టర్ లక్ష్మీశ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని తమ సమస్యలను కలెక్టర్ వద్ద ఏకరువు పెట్టారు. వర్షం పడితే బయటకు రావాలంటే నరకం కనపడుతోందని, రోడ్లు బురదతో అధ్వానంగా ఉండడంతో పాఠశాల బస్సులు కాలనీలోకి రావడం లేదని వాపోయారు. జాతీయ రహదారి వరకు బురదలో నడిచి వెళ్లి పిల్లలను బస్సులు ఎక్కించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్యలో మురుగునీరు నిలిచి ఈగలు, దోమలతో రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. గ్రామ పంచాయతీ అధికారులు కరెంటు మీటర్ల ఏర్పాటుకు డబ్బులు చెల్లించలేదని, వీధి లైట్లు, పంచాయతీ బోర్లకు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాని నిలిపివేస్తున్నారని కలెక్టర్‌కు తెలిపారు. అసలే ఊరికి దూరంగా ఉన్న కాలనీకి వీధిలైట్లు లేకపోతే రాత్రి సమయంలో మహిళలు బయటకు ఎలా రావాలని ప్రశ్నించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరా నిలిపివేతపై విచారణ జరిపి సమస్య పరిష్కరిస్తామన్నారు. కాలనీలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయని, ఓపిక పట్టాలని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జగనన్న కాలనీలో రహదారులు
బాగు చేయాలని కలెక్టర్‌కు వినతి