
ఎన్టీఆర్ డీఆర్వో లక్ష్మీనరసింహం
బాలికా సాధికారతకు సమష్టిగా కృషి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వివక్షకు తావులేకుండా బాలికలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజం పురోగతి సాధిస్తుందని ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహం అన్నారు. బాలికల విద్య, హక్కుల పరిరక్షణకు సమష్టిగా కృషిచేయా ల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శనివారం శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ రైట్స్ అడ్వొకసీ ఫౌండేషన్ (సీఆర్‌ఏఎఫ్) ఆధ్వర్యంలో భాగ స్వామ్య పక్షాలకు ప్రత్యేక వర్క్‌షాప్ జరిగింది. ముఖ్య అతిథి, డీఆర్వో లక్ష్మీనరసింహం మాట్లాడుతూ.. బాలికల విద్య, ఆరోగ్యం, హక్కుల పరిరక్షణ, సామాజిక వివక్షను రూపు మాపడం, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడం వంటి అంశాలపై సమన్వయ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు. గ్రామ స్థాయిలో బాలల సంక్షేమం, భద్రతా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. బాలికల హక్కులతో పాటు ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లపై విద్యా సంస్థల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు వివిధ రకాల పోటీలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ పి.భానుమతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రాధాకుమారి, డీసీపీఓ ఎం.రాజేశ్వరరావు, సీఆర్‌ఏఎఫ్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ తంబి, సమగ్రశిక్ష అధికారి శిరీష రాణి, ఎంఈఓ పుష్పలత, చిన్నారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు.