
సామాజిక భద్రతే ఈఎస్‌ఐ లక్ష్యం
గన్నవరం రూరల్: ప్రజలకు సామాజిక భద్రత కల్పించటం ఈఎస్‌ఐ లక్ష్యమని విజయవాడ ప్రాంతీయ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రణవ్‌కుమార్ తెలిపారు. చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్ధ మెడికల్ కళాశాలలో ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో స్ప్రీ–2025 అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ఉద్యోగులందరినీ నమోదు చేయటం లక్ష్యంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. గతానికి భిన్నంగా స్వీయ నమోదు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 31 వరకూ కొనసాగుతుందని పేర్కొన్నారు. పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో నడిచే కర్మాగారాలు, సంస్థలు, హోటళ్లు, ఆస్పత్రులన్నీ ఈఎస్‌ఐ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసిన మొదటి రోజు నుంచే ఈఎస్‌ఐ చట్టం ద్వారా లభించే ప్రయోజనాలు పొందుతారని ఆటోనగర్ ఈఎస్‌ఐ బ్యాంక్ మేనేజర్ కె.హేమశ్రీ వివరించారు. వైద్య సంరక్షణ ఆయా కుటుంబాలకు రక్షణగా నిలుస్తుందన్నారు. పిన్నమనేని సిద్ధార్ధ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవి భీమేశ్వర్ ఈఎస్‌ఐ పథకంపై చూపిన చొరవ అభినందనీయమని అధికారులు కొనియాడారు.
జాయింట్ డైరెక్టర్ ప్రణవ్‌కుమార్