
అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు స్వాధీనం
కంకిపాడు: అక్రమంగా నిల్వ ఉంచిన దీపావళి టపాసులను కంకిపాడు పోలీసులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ జె.మురళీకృష్ణ తెలిపిన కథనం మేరకు...మండలంలోని ఉప్పలూరు గ్రామంలో గురువారం రాత్రి అదనపు ఎస్‌ఐ తాతాచార్యులు, పీఎస్‌ఐ సత్యం సురేష్ నేతృత్వంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామంలోని మెయిన్‌రోడ్డు పరిసరాల్లో ఉంటున్న నీలం దుర్గారావు ఇంటిని సోదా చేయగా రూ.74,700 విలువైన దీపావళి టపాసులను స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి వంగర రాధాకృష్ణమూర్తిని తనిఖీ చేయగా రూ.2,68,318 విలువైన దీపావళి టపాసులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేయటంపై నీలం దుర్గారావు, వంగర రాధాకృష్ణమూర్తిపై కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న టపాసులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీకృష్ణ, అదనపు ఎస్‌ఐ తాతాచార్యులు తెలిపారు.