
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
తిరువూరు: పట్టణ శివారు పీటీకొత్తూరులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. చౌటపల్లి పాలసేకరణ కేంద్ర వేతన కార్యదర్శిగా పనిచేస్తున్న తేలె వెంకటేశ్వరరావు (60) తన స్వగ్రామమైన చిట్టేల నుంచి తిరువూరు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో అపస్మారక స్థితికి చేరిన వెంకటేశ్వరరావుకు తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ తరలించారు. మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందడంతో తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన మృతికి తిరువూరు క్లస్టర్ పాలశీతల కేంద్ర సిబ్బంది సంతాపం తెలిపారు. దీర్ఘకాలం పాలసేకరణ కేంద్రంలో పనిచేస్తూ రైతులతో సత్సంబంధాలు కలిగిన వెంకటేశ్వరరావు మృతితో చిట్టేల, చౌటపల్లి గ్రామాల్లో విషాదం నెలకొంది.