
సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన
లబ్బీపేట(విజయవాడతూర్పు): తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్‌లో పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు ఆరో రోజు శుక్రవారం కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రిలే దీక్షల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి డాక్టర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన విరమించేది లేదన్నారు. ముఖ్యంగా ఇన్‌సర్వీసు పీజీ కోటాను 20 శాతం అన్ని విభాగాల్లో 2030 వరకూ కొనసాగించాలని డిమాండ్ చేశారు. వాటితో పాటు టైమ్ బాండ్ పదోన్నతులు, టైంబాండ్ స్కేల్స్, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి అదనపు భత్యం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కోరుతూ పీహెచ్‌సీ వైద్యులు శుక్రవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ధర్నా చౌక్ నుంచి నిర్వహించిన ఈ ర్యాలీలో భారీగా వైద్యులు పాల్గొన్నారు.