
ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించాలని కలెక్టర్ డీకే బాలాజీ రైస్ మిల్లర్లను కోరారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జేసీ ఎం.నవీన్ తో కలిసి ధాన్యం సేకరణపై రైస్‌మిల్లుల యజమానులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా యంత్రాంగం, మిల్లర్లు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. గత సంవత్సరం 6.20 లక్షల మెట్రిక్ టన్నుల సేకరించగా ఈ సంవత్సరం 7.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. వరి కోతలు యంత్రాలతో జరగడం వల్ల ధాన్యం ఒకేసారి వచ్చే అవకాశం ఉందని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నాణ్యతలేని ధాన్యం పై రైతులకు అవగాహన కలిగిస్తున్నామన్నారు. జిల్లాలో 37 లక్షల గోనెసంచులు ఉన్నాయని, మరో 17 లక్షల గోనెసంచులు సిద్ధం చేయాలన్నారు. రైతు సేవా కేంద్రాలు, మిల్లర్ల మధ్య తేమ శాతంలో తేడాలు వస్తున్నట్లు గమనించామని, ఈసారి అటువంటివి పరిస్థితిలు రాకుండా రెండు చోట్ల ఒకే రకమైన తేమ శాతం పరీక్షించే యంత్ర పరికరాలను ఉంచుతున్నామని వివరించారు.
పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం...
జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే చెల్లింపులు చేస్తామన్నారు. బ్యాంకు గ్యారంటీలకు సంబంధించి బ్యాంకర్లకు లేఖలు కూడా పంపిస్తున్నామన్నారు. వాహనాల నమోదు కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరగాలన్నారు. గోనెసంచులు ఎవరు ఎన్ని ఇచ్చారో వారికి అన్ని తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరాంప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, మచిలీపట్నం ఆర్డీవో స్వాతి, జిల్లా ఇన్‌చార్జ్ రవాణాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా నిర్వహించండి...
రైతుకు పూర్తి మద్దతు ధర అందించడంలో అధికారులు, సిబ్బంది క్రియాశీలకంగా పని చేయాలని కలెక్టర్ డీకె బాలాజీ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో బందరు డివిజన్‌లోని తహశీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ వ్యవసాయ సహాయకులు (విఏఏ), సాంకేతిక సహాయకులకు (టిఏ) ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణపై అవగాహన శిక్షణ సదస్సు నిర్వహించారు.
కలెక్టర్ డీకే బాలాజీ