
తపాలాలో దుర్గమ్మ ప్రసాదాలు పంపిణీ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాలలో ప్రత్యేక్ష, పరోక్ష పూజలు జరిపించుకున్న ఉభయదాతలకు దేవస్థానం ప్రసాదాలను పోస్టల్ విధానం ద్వారా పంపిణీని ప్రారంభించింది. దసరా ఉత్సవాలలో 11 రోజుల పాటు అమ్మవారికి విశేష కుంకుమార్చన, విశేష శ్రీచక్రనవార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక ఛండీహోమాలను నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు పరోక్షంగా తమ పేరిట పూజలను జరిపించుకునేందుకు ఆన్‌లైన్ ద్వారా దేవస్థానానికి డబ్బులు చెల్లించారు. పరోక్ష సేవలతో పాటు ప్రత్యేక్ష పూజలకు హాజరు కాని భక్తుల వివరాల ప్రకారం అమ్మవారి ప్రసాదాలను దేవస్థానం పంపుతుంది. చీర, పంచె, అమ్మవారి చిత్రపటంతో పాటు అమ్మవారి డాలర్, కంకణాలను పోస్టర్ ద్వారా పంపిణీ చేస్తుంది. పరోక్ష పూజలు జరిపించుకున్న ఉభయదాతలకు శేషవస్త్రం, రవిక, అమ్మవారి ప్రసాదాలను పంపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, ముంబైలలో నివాసం ఉంటున్న భక్తులకు ప్రసాదాలను పోస్టల్ ద్వారా అందజేస్తున్నారు.
తిరుమల దర్శనం పేరుతో రూ.12లక్షలు టోకరా
ఉయ్యూరు: తిరుమల ప్రత్యేక దర్శనం టికెట్లు ఇప్పిస్తామని మాయ చేసి రూ. 12లక్షలు టోకరా వేసిన సంఘటన ఉయ్యూరులో వెలుగుచూసింది. ఈ ఘటనపై ఉయ్యూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఉయ్యూరు సీఐ టీవీవీ రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉయ్యూరుకు చెందిన గుడివాడ దామోదర్‌రావు అలియాస్ దాము అతని కుమారుడు కల్యాణ్ తిరుమల దర్శనం పేరుతో ఓ వ్యక్తికి టోకరా వేశారు. పట్టణంలో ట్యాక్స్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఆ వ్యక్తి కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఈ క్రమంలో గుడివాడ దాముకు సంబంధించిన విజయదుర్గ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ షాపు వద్దకు వెళ్లి నిర్మాణ సామగ్రి కొనుగోలు చేశారు. ఈ క్రమంలో పరిచయం పెంచుకున్న దాము అతని కుమారుడు కల్యాణ్ తిరుమలలో ప్రత్యేక దర్శనం, వసతి ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. అతని వద్ద నుంచి పలు దఫాలుగా రూ.12లక్షలు వసూలు చేశారు. దర్శనం చేయించకుండా, కనిపించకుండా పోవటంతో బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు దామును అరెస్టు చేసి ఉయ్యూరు కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని సీఐ తెలిపారు. మరో నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
బ్యాంకు ఉద్యోగి ఇంట్లో చోరీ
రూ. 22లక్షల విలువైన బంగారం మాయం
కోనేరుసెంటర్: మచిలీపట్నంలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి దాదాపు 216 గ్రాముల బంగారాన్ని అపహరించారు. జరిగిన సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నంలోని నరసింహనగర్‌కు చెందిన విష్ణు కృష్ణా కో–ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు. బుధవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు లోపలికి ప్రవేశించారు. చాకచక్యంగా బీరువా తలుపులు తెరిచి అందులోని 216గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించారు. గురువారం ఉదయం నిద్రలేచిన విష్ణు బీరువా తలుపులు తెరిచి ఉండటాన్ని చూశాడు. అనుమానంతో బీరువా తనిఖీ చేయగా అందులోని బంగారు వస్తువులు కనిపించలేదు. చోరీ జరిగినట్లు గ్రహించి చిలకలపూడి పోలీసులకు సమాచారం అందించాడు.
రంగంలోకి క్లూస్ టీం..
విషయం తెలుసుకున్న చిలకలపూడి సీఐ నభీ ఇతర సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చోరీకి గురైన బంగారం విలువ సుమారు రూ. 22లక్షల వరకు ఉంటుందని బాధితుడు విష్ణు పోలీసులకు చెప్పాడు. దీంతో క్లూస్ టీం రంగంలోకి దిగి నిందితుల వేలిముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.