
వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్
పామర్రు: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. కూటమి ప్రభుత్వం తయారు చేసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి.. ప్రజలను ఇబ్బందులు పాలు జేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్ కుమార్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో సర్పంచ్‌లను, ప్రజా ప్రతినిధులను బెదిరించి పంచాయతీల పాలన సజావుగా సాగనీయడం లేదన్నారు. సర్పంచ్‌ల విధులకు అడ్డు పడుతూ నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే చెక్ పవర్ రద్దు చేస్తామంటూ సర్పంచ్‌లపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.
రైతులకు నష్టపరిహారం ఎక్కడ?
ఇటీవల వచ్చిన వరదలకు తోట్లవల్లూరు మండలంలో ముంపునకు గురైన వాణిజ్య పంటలకు వెంటనే ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని కై లే డిమాండ్ చేశారు. వరదలు తగ్గి నెల రోజులు కావొస్తున్నా ఇంత వరకు జరిగిన నష్టాన్ని అంచనా కూడా సక్రమంగా వేయకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శమన్నారు. వాణిజ్య పంటలు ఒక్కొక్క ఎకరానికి రూ.లక్ష చొప్పన పెట్టుబడులు పెట్టిన రైతులు నష్ట పరిహారం అందక విలవిల్లాడుతున్నారన్నారు. మండలంలో 5,200 ఎకరాలలో పసుపు, కంద, అరటి, బొప్పాయి, కూరగాయలు, చెరకు తదితరాలను హార్టికల్చర్ వ్యవసాయం చేస్తున్నారని దీనిలో సుమారు 2వేల ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లిందని అన్నారు. మినుము పంట పూర్తిగా నీట మునిగి నష్టం ఏర్పడితే ఇంత వరకు జిల్లా స్థాయి అధికారులు పరిశీలన చేసిన దాఖలాలు లేవని అన్నారు. పసుపు పంట సాగుకు ఫసల్‌బీమా పథకంలో ఎకరానికి రూ.1100 చెల్లించి బీమా చేసినట్లు వివరించారు. కనీసం ఆ బీమా క్లయిమ్‌లను కూడా ప్రభుత్వం ఇప్పించలేక పోవడం దారుణమని అన్నారు.
దోచుకోవడం.. దాచుకోవడమే
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన నాటి నుంచి ఎంతసేపు దోచుకోవడం దాచుకోవడమే పనిగా ఉంది తప్ప ప్రజల కష్టాలను పట్టించుకునే పరిస్థితి లేదని కై లే అనిల్ విమర్శించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి దీటుగా తమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిజిటల్ యాప్‌ను ప్రారంభించారని దీని ద్వారా కూటమి నేతలు, అధికారులు తమ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే వారి పేర్లను యాప్‌లో నమోదు చేస్తామన్నారు. ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్, ఐదు మండల అధ్యక్షులు కళ్లవ వెంటేశ్వరరెడ్డి, కాకర్ల వెంకటేశ్వరరావు, రాజుల పాటి రాఘవరావు, యలమంచిలి గణేష్, గోగం సురేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.