
నేటి నుంచి ఈఎన్‌టీ వైద్యుల సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): అసోసియేషన్ ఆఫ్ ఓటోలారింగో లాజిస్ట్స్ ఇండియా (ఏఓఐ) దక్షిణ భారత, రాష్ట్ర సదస్సు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నగరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ కార్యదర్శి డాక్టర్ ఎంఏ రెహమాన్ తెలిపారు. అసోసియేషన్ దక్షిణ భారత, రాష్ట్రశాఖల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని హోటల్ నోవోటెల్‌లో ఈ సదస్సు జరుగుతుందని ఆయన తెలిపారు. గురువారం సదస్సు నిర్వహించనున్న హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సదస్సు దక్షిణ భారత దేశంలోని 750 మందికి పైగా ఈఎన్‌టీ వైద్యులు పాల్గొననున్నట్లు తెలిపారు. దేశ విదేశాల నుంచి ప్రఖ్యాతిగాంచిన ఈఎన్‌టీ విభాగ ప్రొఫెసర్‌లు ఫ్యాకల్టీగా రానున్నారన్నారు. ఈ నెల 11న జరిగే ప్రారంభోత్సవ సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొంటారని, నిర్వహణ అధ్యక్షుడిగా డాక్టర్ కేవీఎస్ చౌదరి, డైరెక్టర్‌గా డాక్టర్ పీఎస్‌ఎన్ మూర్తి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కాగా డాక్టర్ అక్కినేని శివరామ్‌తో పాటు, నగరంలోని పలువురు వైద్యులు పర్యవేక్షిస్తారని రెహమాన్ వివరించారు.