
రోడ్డు ప్రమాదాలను నివారించండి
ఆక్వా సాగును ప్రోత్సహించండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో గురువారం రహదారి భద్రతా ఏర్పాట్లపై అధికారు లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కువగా జాతీయ రహదారుల్లో జరిగే ప్రమాదాల్లోనే ప్రజలు మృత్యువాత పడుతున్నారన్నారు. గూగుల్ మ్యాప్ ద్వారా ప్రయాణించే వారికి ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ వివరాలు తెలిసేలా చూస్తే వారు అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు. చెన్నయ్ ఐఐటీ సీనియర్ ఇంజినీర్ రాగుల్ రోడ్డు ప్రమాదాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐ రాడ్ అందించిన వివరాలను అనుసరించి ప్రమాదాలు అధికంగా జరిగే వంద జిల్లాలో కృష్ణా జిల్లా 75వ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో 23 బ్లాక్ స్పాట్‌లు ఉన్నాయని, 2023 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 2,068 ప్రమాదాలు జరిగాయని, 734 మంది చనిపోగా 1887 మంది గాయపడ్డారని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతోనే ప్రమాదా లను నివారించొచ్చని సూచించారు. ప్రమాదాల నివారణకు సంజయ్ యాప్, ఫీల్డ్ పర్సెప్షన్ సర్వే యాప్, ట్రామా కేర్ ప్రిపేర్డ్‌నెస్ లెవల్ యాప్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు గుర్తించిన బ్లాక్ స్పాట్లలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా సాంకేతికత సాయంతో తెలుసుకోవచ్చన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన జరగనున్న జిల్లా రహదారి భద్రత సమావేశంతో పాటు భవిష్యత్‌లో నిర్వహించే సమావేశాలకు చెన్నయ్ విద్యార్థులు తప్పనిసరిగా వచ్చి సాంకేతిక సహకారాన్ని అందించాలని కోరారు. ఈ సమావేశంలో చెన్నయ్‌కు చెందిన సీనియర్ ఇంజినీర్ నవీన్‌కుమార్, రవాణాశాఖ అధికారి శ్రీనివాస్, రహదారులు, భవనాలశాఖ ఈఈ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వా సాగు వైపు దృష్టిసారించేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ బాలాజీ సూచించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆక్వా సాగుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతికతను అవలంబించి వినూత్న పద్ధతుల్లో ఆక్వా సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయన్నారు. ఇలా సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద నందివాడ మండలాన్ని ఓ క్లస్టర్‌గా తీసుకుని, ఆరు గ్రామాల పరిధిలోని 300 మంది రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో చేసే సాగుపై అవగాహన కలిగించాలన్నారు. ఆక్వా ఎక్సేంజ్ లిమిటెడ్ సహాయ వ్యవస్థాపకుడు కిరణ్‌కుమార్.. ఆక్వా సాగును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ జేడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ