
నిత్యాన్నదానానికి రూ.7.91 లక్షల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు రూ.7.91 లక్షల విరాళాలు సమర్పించారు. విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన టి.ఈశ్వరదుర్గానాగేంద్ర కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి వచ్చి రూ.5,89,055 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసింది. లంబాడీ పేటకు చెందిన డి.రంగారావు కుటుంబ సభ్యులు ఈఓ శీనానాయక్‌ను కలిసి రూ.2,02,116 విరాళం అందజేశారు. దాతలకు ఆలయ మర్యా దలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
పెడన: సహజ సిద్ధ కలంకారీకి పేరు గాంచిన పెడనకు గురువారం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికులు శ్రీనివాస కోరమండల్ కలంకారీ పరిశ్రమను సందర్శించారు. వస్త్రాల తయారీని పరిశీలించారు. మహారాష్ట్ర, రాజ స్థాన్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల ఐటీ, హెచ్‌ఆర్ ఉద్యోగులు రాగా వారికి టూరిస్ట్ గైడ్‌లు నవల్‌దీప్, ఆశ్విత కలంకారీపై వివరాలు తెలిపారు. ప్రింటింగ్ వేయడం, రంగులు ఎలా వస్తున్నాయి తదితర విషయాలను పరిశ్రమ యజమాని పిచ్చుక వరుణ్ వివరించారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పాఠశాల్లో ఈ నెల పదో తేదీ నుంచి బోధనేతర విధులను బహిష్కరిస్తున్నట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ ఎ.సుంద రయ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీనరసింహం, డీఈఓ యు.వి.సుబ్బా రావును ఫ్యాప్టో నేతలు గురువారం వేరువే రుగా కలిసి బోధనేతర పనులను చేయబోమని మెమొరాండం సమర్పించారు. అనంతరం సుందరయ్య మాట్లాడుతూ.. ఫ్యాప్టో పోరుబాట కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన కార్యాచరణలో భాగంగా బోధనేతర విధులను బహిష్క రిస్తున్నామని తెలిపారు. బోధనకే పరిమితమై మరింత నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని నిర్ణయించామన్నారు. ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ డాక్టర్ ఇంటి రాజు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను తగ్గించాలని డిమాండ్ చేశారు. కో చైర్మన్ జి.రామారావు, డెప్యూటీ సెక్రటరీ జనరల్ వేముల భిక్షమయ్య, నాయకులు సయ్యద్ ఖాసీం, కుక్కడపు శ్రీనివాసరావు, జి.అనుగ్రహప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కోనేరుసెంటర్(మచిలీపట్నం): దీపావళి పండు గను పురస్కరించుకుని బాణసంచా తయారీదారులు, వ్యాపారులు పోలీసు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు ఆదేశించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినా, హెచ్చరికలను పెడచెవినపెట్టినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిసూత గురువారం ప్రకటన విడుదల చేశారు. లైసెన్స్ లేకుండా బాణ సంచా తయారీ, విక్రయాలు నేరమని స్పష్టంచేశారు. బాణసంచాను భద్రపరిచే గోదాములకు కూడా లైసెన్స్ ఉండాలని పేర్కొన్నారు. లైసెన్స్ తీసుకునే ప్రతి వ్యాపారి తమ షాపులో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ చేయించా లని, నిబంధనలనను కచ్చితంగా పాటించా లని ఆదేశించారు. ఇళ్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులకు దూరంగా బాణసంచా తయారీ కేంద్రాలు, స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమా చారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా బాణసంచా విక్రయిస్తున్నట్లు, తయారు చేస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.