
ఉద్యోగ సర్వీసు క్రమబద్ధీకరించాలని వినతి
మోపిదేవి: రాష్ట్రంలోని పలు దేవస్థానాల్లో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని (రెగ్యులర్) కోరుతూ దేవదాయ, ధర్మదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను మినిమమ్ టైమ్ స్కేల్ ఉద్యోగులు గురువారం వారి కార్యాలయాల్లో కలసి వినతిపత్రాలు అందజేశారు. మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్ధీకరించి వార్షిక ఇంక్రి మెంట్లు, హెచ్‌ఆర్‌ఏ, డీఏ, ఐఆర్ వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. తమ సమస్యలపై మంత్రులు స్పందించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని ఉద్యోగులు తెలిపారు.
ఎరువుల దుకాణాల్లో
విజిలెన్స్ తనిఖీలు
నాగాయలంక: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నాగాయలంకలోని ఎరువుల దుకాణాలలో విజిలెన్స్ అధికారి తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఏడీఏ వి.కిరణ్ కుమార్, స్థానిక ఏఓ ఎ.సంజీవ కుమార్ సిబ్బందితో కలసి కార్తికేయ ట్రేడర్స్, సస్యశ్యామల ఫెర్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్, సాయివర్షిణి ఫెర్టిలైజర్స్ దుకాణాల్లో తనిఖీలు జరిపారు. కార్తికేయ ట్రేడర్స్‌లో ఓ–ఫామ్ లైసెన్స్‌లో చేర్పించని కారణంగా మొత్తం రూ.11,37,070 విలువైన ఎరువుల విక్రయాలను నిలిపివేశారు. లైసెన్స్‌లో ఓ–ఫామ్ చేర్పించుకోవాలని ఆదే శించారు. ఎరువుల విక్రయదారులతో రైతులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే తక్షణం విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా సూచించారు.
రూ.1.45 లక్షలసిగరెట్లు స్వాధీనం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): నిషేధిత సిగరెట్లను అక్రమంగా నిల్వ చేసిన ఇంటిపై కొత్త పేట పోలీసులు గురువారం దాడి చేశారు. రూ.1.45 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. సౌమ్య థియేటర్ సమీపంలోని రాజీవ్‌శర్మనగర్‌కు చెందిన కొత్తప్రసాద్ కొంత కాలంగా నిషేధిత సిగరెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ పద్మారావు గురువారం ప్రసాద్ ఇంటిపై దాడి చేసి 12 బాక్స్‌ల సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.45 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఉద్యోగ సర్వీసు క్రమబద్ధీకరించాలని వినతి