
ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చూడాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో విజయవాడ మీదుగా ప్రయాణం సాగించే వారికి ఎటువంటి అవాంత రాలూ లేకుండా చూడాలని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సావ్ జరగనున్న నేపథ్యంలో వాహనదారుల సౌలభ్యం కోసం వెస్ట్ బైపాస్ ఏరియాను కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ నేపథ్యంలో ప్రయాణికులు, వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ సౌలభ్యం కోసం వెస్ట్ బైపాస్‌ను ఉపయోగించాలని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని వాహనదారుల ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యాలని నిర్ణయించినట్లు తెలిపారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో పాటుగా ఏపీ ట్రాన్స్‌కో, వెస్ట్ బైపాస్ ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇతర అధికారులు వెస్ట్ బైపాస్ ఏరియాను పరిశీలించారు. వాహనదారుల ప్రయాణాలపై సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అనంతరం పార్కింగ్ ఎరియాలను, కుమ్మరిపాలెం నుంచి దుర్గాఘాట్ వరకు క్యూలైన్లను, దుర్గాఘాట్ నుంచి మహామండపం, కనకదుర్గానగర్, రథం సెంటర్, వినాయక టెంపుల్, సీతమ్మ వారి పాదాలు, హోల్డింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి, ఏడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.