
జనవరిలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టో
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): వచ్చే జనవరిలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ (మహిళలు) టోర్నీ నిర్వహిస్తామని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. 2025–2026 సంవత్సరానికి స్పోర్ట్స్ క్యాలెండర్‌ను ఖరారు చేయడానికి హెల్త్ వర్సిటీ పరిధిలోని అన్ని మెడికల్ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్ల సమావేశం విజయవాడలోని వర్సిటీ ఆవరణలో గురువారం జరిగింది. ఈ సమావేశంలో నిర్ణయించిన వివరాలను చంద్రశేఖర్ వెల్లడించారు. న్యూఢిల్లీలోని ఇండియన్ యూనివర్సిటీల సంఘం కేటాయించిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ (మహిళలు) టోర్నీని జనవరిలో నిర్వ హించాలని నిర్ణయించారు. నెల్లూరులోని నారా యణ మెడికల్ కాలేజీలో పురుషుల గేమ్స్ మీట్, విశాఖపట్నంలో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో ఉమెన్స్ గేమ్స్ మీట్, శ్రీవెంకటేశ్వర వైద్య కళాశాలలో పురుషుల క్రికెట్ టోర్నీ, కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో అథ్లెటిక్ మీట్, విజయనగరంలోని మహారాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి సైన్సెస్‌లో పురుషులు–మహిళల కోసం గేమ్స్ మీట్, నారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో నర్సింగ్ ఉమెన్ గేమ్స్ మీట్, రాజమండ్రి లోని మెడికల్ కాలేజీలో పీజీల కోసం పురుషుల క్రికెట్ టోర్నీ, గన్నవరం మండలం చిన్నఅవుటుపల్లిలోని డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పురుషులు–మహిళల పీజీలకు గేమ్స్–స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికరెడ్డి, వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ ఇ.త్రిమూర్తి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం క్రీడా కార్యకలాపాలకు ప్రోత్సాహం అందించినందుకు వీసీ చంద్రశేఖర్‌ను సత్కరించారు.