
ఆటో కార్మికులను ఆదుకోండి
రవాణా శాఖ మంత్రి ఇంటి వద్ద నిరసన
లబ్బీపేట(విజయవాడతూర్పు): సీ్త్ర శక్తి పథకం వల్ల నష్టపోతున్న తమను ఆదుకోవాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బృందావన కాలనీ నందమూరి రోడ్డులోని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నివాసం వద్ద సోమవారం ఉదయం ఏఐటీయూసీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తొలుత పలువురు ఆటో కార్మికులు మంత్రి రాంప్రసాద్‌రెడ్డిని కలిసి సీ్త్ర శక్తి పథకం అమలు చేసిన తర్వాత తమ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. అనంతరం ఇంటి ముందు బ్యానర్‌తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ.. డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక వేలాది మంది ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. సజావుగా సాగుతున్న వారి జీవితాలు, ప్రస్తుతం అగమ్యగోచరంగా మారాయన్నారు. ప్రతి కార్మికునికి నెలకు రూ.5వేల పింఛన్ ఇవ్వాలని, ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, జీఓ 21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రభుత్వం ప్రమాద బీమా అమలు చేయాలని కోరారు.