బెజవాడలో మృత్యుఘోష | - | Sakshi
Sakshi News home page

బెజవాడలో మృత్యుఘోష

Sep 11 2025 6:30 AM | Updated on Sep 11 2025 1:35 PM

 Collector Lakshisha visiting Diarrhea victims at Government Hospital

ప్రభూత్వాస్పత్రిలో డయేరియా భాధితులను పరామర్శిస్తున్న కలెక్టర్ లక్షీశ

న్యూ ఆర్‌ఆర్‌ పేటలో ప్రబలిన అతిసార 

ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు 

కలుషిత తాగునీరే కారణమని ఆరోపణలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో డయేరియా పడగవిప్పింది. న్యూ రాజరాజేశ్వరి పేటలో ఇప్పటికే ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు. వంద మందికి పైగా బాధితులు ఆస్పత్రులు, ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్నారని సమాచారం. న్యూ రాజరాజేశ్వరి పేటలో వారం రోజులుగా కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీటి నుంచి దుర్వాసన వస్తోంది. అయినా నగర పాలక సంస్థ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఈ నెల ఏడో తేదీ నుంచి ఆ ప్రాంతంలో అతిసార కేసులు నమోదవుతున్నాయి. అధికారులు మాత్రం మంగళవారం రాత్రి తీసుకున్న కలుషిత ఆహారం కారణమని చెప్పుకొస్తున్నారు. బుధవారం మరికొందరు స్థానికులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. కొందరు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లగా, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అతిసారతో ఎంత మంది బాధపడతున్నారనేది అధికారులకు కూడా అంతుచిక్కని పరిస్థితి. వంద మంది వరకూ వేర్వేరు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నట్లు అంచనా వేస్తున్నారు. వారిలో చిన్నారులు, వృద్ధులు ఉండగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఉరుకులు పరుగులు

న్యూ రాజరాజేశ్వరిపేట నుంచి అతిసారతో బాధితులు ఆస్పత్రుల దారి పట్టారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి సైతం బాధితులు రాగా ప్రాథమిక వైద్యం అందించి పంపించేశారు. అదే సమయంలో పలువురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. బుధవారం ఉదయానికి పరిస్థితి తీవ్రమైంది. వాంతులు, విరేచనాలతో బాధపడే బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో వైద్య శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని బాధితులను గుర్తించే ప్రయత్నాలు చేపట్టారు. కొందరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, మరి కొందరికి సింగ్‌నగర్‌ యూపీహెచ్‌సీలో వైద్యం అందించారు. అయితే ఎంత మంది అతిసారకు గురయ్యారనే విషయం లెక్కతేలడం లేదు. మరో వైపు అతిసారకు తాగునీరు కారణమా అనే విషయం తేల్చేందుకు గురువారం వాటర్‌ ఎనలిస్ట్స్‌ ఆ ప్రాంతంలో పర్యటించి శాంపి ల్స్‌ను పరీక్షించనున్నారు.

జీజీహెచ్‌లో 25 మంది

అతిసార బాధితులు ప్రస్తుతం 25 మంది జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. మరొక చిన్నారి పాత ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారికంగా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎ.వెంకటేశ్వరరావు ప్రకటించారు. మరో ముగ్గురు మంగళవారం రాత్రి చికిత్స కోసం రాగా వారి పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు నిర్ధారించి పంపించివేసినట్లు తెలిపారు. బాధితుల నుంచి రక్త, మల, మూత్ర నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్‌ జి.లక్ష్మీశ పరామర్శించారు. బాధితులకు మెరుగైన, వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

28 మందిని నిర్ధారించాం

అతిసారకు గురైన వారు 28 మంది వేర్వేరు ప్రాంతాల్లో చికిత్స పొందినట్లు నిర్ధారించామని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మాచర్ల సుహాసిని తెలిపారు. మరో ఆరుగురు ఓపీలో పరీక్షలు చేసుకుని వెళ్లారని పేర్కొన్నారు. ఇప్పటికే 735 గృహాలను సర్వేచేశామని, గురువారం మరిన్ని గృహాలను సర్వే చేస్తా మని పేర్కొన్నారు. ఎక్కువ మంది సమీపంలోని ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లారని, వారి వివరాలు తీసు కున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఎంత మంది వెళ్లారనే సమాచారం సర్వేలో రాలేదన్నారు. తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపామని, వాటి ఫలితాలు వచ్చేందుకు మూడు రోజుల సమయం పడుతుందన్నారు.

బాధితులకు మల్లాది విష్ణు పరామర్శ

ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదని, పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని వైఎస్సార్‌ సీపీ సెంట్రల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మల్లాది విష్ణు విమర్శించారు. న్యూఆర్‌ ఆర్‌పేటలో కలుషిత నీరు తాగి ప్రజలు చనిపో వడం, డయేరియా బారిన పడ్డారని తెలుసుకున్న ఆయన పార్టీ నాయకులతో కలిసి బుధవారం సాయంత్రం ఆ ప్రాంతంలో పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు పక్కనే ఉన్న తురకపాలెంలో నాలుగు నెలల వ్యవధిలో 40 మంది చనిపోయారని, ఇప్పుడు న్యూరాజరాజేశ్వరీపేటలో ఇద్దరు మృతిచెందగా, అనేక మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలయ్యా రని ఆందోళన వ్యక్తంచేశారు. కుళాయిల్లో వచ్చే నీటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఈ ప్రాంతానికి కలెక్టర్‌, మునిసిపల్‌ కమిషనర్‌, ఉన్నతాధికారులను పంపి వ్యాధికి కారణాలను తెలుసుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. డెప్యూటీ మేయర్‌ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్‌ ఇసరపు దేవి, వైఎస్సార్‌ సీపీ నాయకులు ఇసరపు రాజు, ఆదినారాయణ, పఠాన్‌ నజీర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement