
స్పెషల్ డ్రైవ్ చేపట్టండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా అప్రమత్తంగా ఉండా లని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా డెంగీ, మలేరియా, డయేరియా కేసులు నమోదైతే పరిసర ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటికి క్రమంతప్పకుండా పరీక్షలు నిర్వహించి, నివేదికల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. నిలిచిన నీటి నమూనాలకు కూడా బ్యాక్టీరియలాజికల్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌లు చేపట్టాలని, ఓవర్‌హెడ్ రిజర్వాయర్ల క్లీనింగ్, క్లోరినైజేషన్ సక్రమంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. డ్రెయిన్లలో డీ సిల్టేషన్‌కు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. డీపీఓ పి.లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు.