
గ్రంథాలయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని రకాల గ్రంథాలయ పోస్టులను వెంటనే భర్తీ చేసి రెండు లక్షలమంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ అసోసియే షన్ కార్యదర్శి డాక్టర్ రావి శారద, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. డీవైఎఫ్‌ఐ – ఏపీ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద బుధవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల పరిధిలో సీఎల్‌ఐఎస్‌సీ, బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ, నెట్, సెట్, పీహెచ్‌డీ కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగుల సంఖ్య రెండు లక్షలకు చేరిందని తెలిపారు. ఖాళీగా ఉన్న లైబ్రరీయన్ పోస్టుల భర్తీకి తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గతంలో ఏపీపీఎస్సీ దగ్గర నిలిచిపోయిన జూనియర్, డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కార్యదర్శి లక్ష్మయ్య, ఏపీ లెబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ కె.జగదీశ్, డీవైఎఫ్‌ఐ నాయకులు పి.కృష్ణ, పిచ్చయ్య, కృష్ణ కాంత్ తదితరులు పాల్గొన్నారు.