
మెదడులో మాంసం తినే పరాన్నజీవి
శస్త్ర చికిత్స చేసి తొలగించిన విజయవాడ జీజీహెచ్ వైద్యులు స్క్రూవార్మ్‌గా నిర్ధారించినజూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
లబ్బీపేట(విజయవాడతూర్పు): రోగి మెదడులో మాంసం తింటున్న అరుదైన పరాన్నజీవిని విజయవాడ జీజీహెచ్ న్యూరోసర్జరీ వైద్యులు శస్త్ర చికిత్సతో తొలగించారు. అనంతరం దానిని నిర్ధారించేందుకు విశాఖపట్నం, గుంటూరు, కోల్‌కత్తాలోని జీవశాస్త్ర నిపుణులకు పంపించారు. మాంసం తినే స్క్రూవార్మ్ పరాన్నజీవిగా వారు నిర్ధారించినట్లు జీజీహెచ్ న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఐ.బాబ్జి శ్యామ్‌కుమార్ తెలిపారు. ఈ పరాన్నజీవిని తొలిసారిగా అమెరికాలో ఈ ఏడాది ఆగస్టు నాలుగో తేదీన గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.
కేసు వివరాలు ఇలా...
తీవ్రమైన తలనొప్పితో అపస్మారక స్థితిలో ఉన్న 50 ఏళ్ల మహిళను కుటుంబ సభ్యులు విజయవాడ జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఆస్పత్రి వైద్యులు ఆమెను పరీక్షించి, తలనుంచి చీము కారుతోందని గుర్తించారు. స్కాన్ చేసి ఆమె మెదడులో చీము గడ్డ ఉన్నట్టు నిర్ధారించారు. మానని లోతైన గాయంలో కదులుతున్న క్రిములను మాగ్గోట్‌లుగా గుర్తించారు. ఆ మహిళకు శస్త్ర చికిత్స చేసేందుకు నిర్ణయించి తొలుత తలలోని పుండు నుంచి మాగ్గోట్లను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం తలపై గాయాన్ని తొలగించి శుభ్రపరచడంతో పాటు, శస్త్ర చికిత్స చేసి మెదడులోని చీము గడ్డను తొలగించారు. అనంతరం ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఎ.ఆర్.సి.హెచ్.మోహన్ సారథ్యంలో ఫ్లాప్ సర్జరీ చేసి తలపై ఉన్న గాయాన్ని కప్పేశారు. ప్రస్తుతం రోగి కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
నిర్ధారణ ఇలా...
మెదడు నుంచి తొలగించిన మాగ్గోట్లను, క్రిమి గురించి ఆంధ్రా యూనివర్సిటీ జీవశాస్త్ర నిపుణులు డాక్టర్ జ్ఞాణమణి, గుంటూరు లామ్ నిపుణులు రత్నంను సంప్రదించగా వారు స్క్రూ వార్మ్‌లుగా గుర్తించారు. అనంతరం కోల్‌కత్తాలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారిని కూడా సంప్రదించి స్క్రూవార్మ్‌లుగా నిర్ధారణ చేశారు. సాధారణంగా ఈగల నుంచి జనించే మాగ్గోట్‌లు జంతువులు, మనుషుల శరీరంలో చెడిపోయిన, కుళ్లిన నిర్జీవ కణజాలాలపై మాత్రమే ఆధారపడి జీవిస్తాయి. కానీ స్క్రూవార్మ్ సజీవ కణజాతాలను సైతం తినే పరాన్నజీవులుగా జీవిస్తాయని వైద్యులు తెలిపారు. అరుదైన సర్జరీచేసిన న్యూరోసర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు అభినందించారు.
రోగి మెదడులో నుంచి తీసిన
అరుదైన పరాన్నజీవి స్క్రూవార్మ్

మెదడులో మాంసం తినే పరాన్నజీవి

మెదడులో మాంసం తినే పరాన్నజీవి