దేవుని మాన్యంలో ఆగిన మట్టి తోలకాలు! | - | Sakshi
Sakshi News home page

దేవుని మాన్యంలో ఆగిన మట్టి తోలకాలు!

Sep 11 2025 6:30 AM | Updated on Sep 11 2025 6:30 AM

దేవుని మాన్యంలో ఆగిన మట్టి తోలకాలు!

దేవుని మాన్యంలో ఆగిన మట్టి తోలకాలు!

భూమి చదును పనులను మళ్లీ ప్రారంభించేందుకు యత్నాలు అధికారులపై ఒత్తిడి తెస్తున్న కూటమి నాయకులు ఉత్సవాలు నిర్వహించేది ప్రైవేటు వ్యక్తులా? ప్రభుత్వమా? మట్టి తోలకాలతో భూమి స్వరూపమే మారిన వైనం

సాక్షి ప్రతినిధి, విజయవాడ: మచిలీపట్నంలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి విజయవాడకు కూత వేటు దూరంలోని గొల్లపూడిలో ఉన్న 39.99 ఎకరాల దేవుని మాన్యం ఉంది. ఈ మాన్యం భూముల్లో అనుమతులు లేకుండా విజయవాడ ఉత్సవ్‌ పేరుతో మట్టి తోలి చదును చేసే పనులు నిలిచిపోయాయి. ఇక్కడ జరుగుతున్న పనులపై ప్రభుత్వ పెద్దలు ఆరా తీసి, దేవదాయ శాఖ పొలాల్లో ఎగ్జిబిషన్‌ ఎలా ఏర్పాటు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టీడీపీలోని వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. విజయవాడ ఉత్సవాలకు వేరే ప్రైవేటు స్థలాన్ని చూసుకోవాలని చెప్పినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

దేవుడి మాన్యం చదునుపై అనుమానాలు

దేవుడి మాన్యం భూమిని చదును చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ ఉత్సవ్‌ అనేది ప్రభుత్వ కార్యక్రమమా? ప్రైవేటు కార్యక్రమమా? అనే స్పష్టత ఇప్పటికీ లేదని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. వీటి నిర్వహణకయ్యే ఖర్చును ఏవిధంగా సమకూర్చుతున్నారనే అంశంపైనా చర్చ సాగుతోంది. ప్రముఖులు, వ్యాపార సంస్థల నుంచి చందాల వసూళ్లకు ప్రణాళిక రచించారనే ఆరోపణలపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. విజయవాడ ఉత్సవ్‌ వెనుక భారీ, దీర్ఘకాలిక ప్రణాళిక ఉందని టీడీపీ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్థలంలో గుంటూరుకు చెందిన ఓ మీడియా సంస్థ మల్టీ కాంప్లెక్స్‌లు, మల్టీ థియేటర్లు నిర్మిస్తుందని, ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న మరో నేత రిక్రియేషన్‌ క్లబ్‌, ఓ ప్రముఖ హోటల్‌ సంస్థ యజ మాని స్టార్‌ హోటల్‌ నిర్మాణం చేపడుతారని, మరో టీడీపీ నాయకుడు క్యాంటీన్‌లు, చిన్న హోటళ్లు ఏర్పాటు చేసుకునేలా ఒప్పందం జరిగిందని కూటమి నాయకులు పేర్కొంటున్నారు. ఆ స్థలంపై కన్నేసిన వారిలో కొంత మంది ప్రస్తుతం చేస్తున్న ఏర్పాట్ల కోసం పెట్టుబడులు పెట్టడంతోపాటు, పెద్ద ఎత్తున చందాలు వసూలు చేసేందుకు రూప కల్పన జరిగిందని సమాచారం. అయితే ఈ విషయాలు ప్రభుత్వ పెద్దల దృష్టికి చేరాయని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు.

పెద్దలకు విన్నపాలు

విజయవాడ ఉత్సవ్‌ జరుపుతామని ప్రచారం చేశామని, ఎలాగైనా అక్కడే ఉత్సవాలు జరపా లని టీడీపీ నేతలు గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తాత్కాలికంగా అయినా ఉత్సవాలకు అనుమతి ఇప్పించాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నారు. ఇప్పటికే లీజు ఉండటంతో, వారి నుంచి సబ్‌ లీజుకు తీసుకొనే అవకాశం లేదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఆ లీజుదారులను ఒప్పించి వారి లీజు రద్దు చేసి, గుడికి ఆదాయం ఎక్కువగా వస్తుందని చూపి, తాత్కాలికంగా ఈ ఉత్సవాల వరికై నా అనుమతి పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పంటలు పండే పొలంలో కోట్ల రూపా యల మట్టిని ఆ ప్రదేశంలో నింపారు. ఈ మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులూ తీసుకో లేదు. ప్రభుత్వం ఈ భూమి కేటాయింపులు నిలిపి వేసినా మూడు అడుగుల మేర నింపిన మట్టి తొలగింపు ఎలా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. మొత్తం మీద గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూమికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొంటుందనే విషయం చర్చనీ యాంశంగా మారింది. ఇప్పటికే గుడి కమిటీ, విశ్వ హిందు పరిషత్‌ సంస్థ సభ్యులు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడిలో సమావేశమై ఆ భూమిని ఏ విధంగా కాపాడుకోవాలి అనే దానిపై కార్యాచరణ రూపొందించారు.

దేవుడి మాన్యంపై కూటమి నేతల కన్ను

గొల్లపూడిలో ఉన్న 39.99 ఎకరాల దేవుని మాన్యంపై విజయవాడ పార్లమెంట్‌ ముఖ్యనేతతో పాటు, మరికొంత మంది టీడీపీ నేతల కన్ను పడింది. విజయవాడ ఉత్సవ్‌ ముసుగులో ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఎత్తుగడ వేశారు. రూ.400 కోట్ల విలువైన ఈ 39.99 ఎకరాల్లో వరల్డ్‌ క్లాస్‌ గోల్ఫ్‌ ప్రాక్టీస్‌ రేంజ్‌ అండ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ పేరుతో ఐదు ఎకరాలు, ఏటా విజయవాడ ఉత్సవాల పేరుతో ట్రేడ్‌ ఎక్స్‌పో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్‌హెచ్‌జీ మేళా, అగ్రిటెక్‌ షో, టూరిజం ప్రమోషన్‌ ఈవెంట్లతో ఎగ్జిబిషన్‌ నిర్వహించేందుకు శాశ్వత వేదిక నిర్మాణం పేరుతో మరో 34.99 ఎకరాల భూమి లీజు కోసం జిల్లా యంత్రాంగం నుంచి దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ప్రతిపాదనలు వెళ్లాయి. ఆ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి పనులూ మాన్యం భూమిలో చేపట్టరాదని దేవదాయశాఖ అధికారులు జిల్లా యంత్రాంగానికి అధికారికంగా తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement