
ఇంకెన్నాళ్లీ ‘కట్ట’కట?
యూరియా కోసం కొనసాగుతున్న రైతుల పాట్లు
కంకిపాడు: యూరియా కొరత సమస్య రైతులను వెంటాడుతూనే ఉంది. యూరియా కట్ట కోసం రైతులు క్యూ కడుతున్నారు. పీఏసీఎస్‌ల వద్ద కట్టల కోసం తోపులాటలు, గంటల కొద్దీ నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంటోంది. యూరియా అందు బాటులో ఉందని అధికారులు చెబుతున్నా, యూరియా అందక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారంటే కూటమి ప్రభుత్వ ప్రచారంలో వాస్తవం ఎంతో అర్థం చేసుకోవచ్చు.
సొసైటీల వద్ద పడిగాపులు..
పీఏసీఎస్‌లకు యూరియా స్టాకు రావటంతో అధికారులు వచ్చి, స్లిప్పులు పంపిణీ చేసే వరకూ యూరియా సరఫరా జరగకపోవటంతో రైతులు సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. అధికారులు వచ్చిన తర్వాత ఒక్కో రైతుకు ఎకరాకు అరకట్ట చొప్పున గరిష్టంగా మూడు కట్టలు చొప్పున మాత్రమే పంపిణీ చేస్తూ స్లిప్పులు అందజేశారు. బుధవారం మండలంలోని ఉప్పలూరు, పునాదిపాడు, మంతెన, కోలవెన్ను, తెన్నేరు, ప్రొద్దుటూరు, నెప్పల్లి సొసైటీలకు 15 టన్నులు చొప్పున, గొడవర్రు, మద్దూరుకు 10 టన్నులు యూరియా వచ్చింది. సమాచారం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా ఆయా సొసైటీలకు చేరుకోవటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. పంట పొలాలు చిరుపొట్ట దశకు చేరుకోవటంతో ఈ దశలో యూరియా అందించాలని, అదును తప్పితే దిగుబడులుపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు చెబుతున్నారు. సమస్యను అధిగమించేందుకు రైతాంగం యూరియా కోసం సొసైటీల వద్ద క్యూలు కట్టారు. ఉప్పలూరు, గొడవర్రు సొసైటీల వద్ద స్లిప్పులు కోసం రైతులు పోటీ పడటంతో ఒకానొక దశలో రైతుల మధ్య తోపులాటలు, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. సొసైటీలకు యూరియా నిల్వలు వచ్చినా అది కూడా అరకొరగానే పంపిణీ జరిగిందని, పూర్తి స్థాయిలో యూరియా అందలేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు అరకట్ట యూరియా సరిపోదని, కట్ట సరఫరా చేస్తే మేలు జరుగుతుందని కోరుతున్నారు.
అధికారుల పర్యటన..
మండలంలోని సొసైటీల్లో జరుగుతున్న యూరియా పంపిణీ తీరును జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, విజిలెన్స్ డీఎస్పీ బంగార్రాజు పరిశీలించారు. కోలవెన్ను, ఉప్పలూరు, గొడవర్రు, పునాదిపాడు గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు ఎకరాకు కట్ట చొప్పున యూరియా పంపిణీ చేయాలని కోరారు. అదును పోక ముందే పంటకు యూరియా, కాంప్లెక్సు ఎరువులు అందించాలని, రైతుల అవసరాలను గుర్తించి ఎరువులు అందించాలని విన్నవించారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి పద్మావతి మాట్లాడుతూ రైతుల అసరాల మేరకు ఎరువులు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పర్యటనలో మండల వ్యవసాయాధికారి వెలివెల ఉషారాణి, సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యే లేదంటున్న ప్రభుత్వం
అన్నదాతలకు తప్పని పడిగాపులు
అరకట్ట కోసం క్యూలు కడుతున్న వైనం
పీఏసీఎస్‌ల వద్ద తోపులాటలు, వాగ్వాదాలు

ఇంకెన్నాళ్లీ ‘కట్ట’కట?