
ఐటీ చెల్లింపుదారుల సేవలు మెరుగుపర్చాలి
ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ అనిల్‌కుమార్
లబ్బీపేట(విజయవాడతూర్పు):ఆంధ్రప్రదేశ్– తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఆధాయపు పన్నుశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎం. అనిల్‌కుమార్ గురువారం విజయవాడలో అధికారిక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఉన్న ఆదాయపు పన్నుశాఖ అధికారులతో చేపట్టిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచడం, సమ్మతి విధానాలు బలోపేతం చేయడం, విభాగ పనితీరును క్రమబద్దీకరించడంపై దృష్టి సారించాలని సూచించారు. వివిధ కీలక పనితీరు సూచికలు, ఆదాయ సేకరణ లక్ష్యాలు, పన్ను చెల్లింపుదారులను చేరుకునే ప్రయత్నాలు, విధాన సంస్కరణల అమలు గురించి చర్చించారు. ఈ విభాగం పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యం ప్రాముఖ్యతపై సమీక్షించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని, విజయవాడ ప్రధాన కమిషనర్ జయరామ్ రాయ్‌పుర, ప్రిన్సిపల్ కమిషనర్ సునీతా బిల్లా, వి.జనార్ధనన్‌లతో పాటు, ట్యాక్స్ బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
దీవుల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ అవగాహన సదస్సులు
ఎదురుమొండి(నాగాయలంక):జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో మండల పరిధిలోని దీవుల్లో ఎదురుమొండి, నాచాగుంట, ఈలచెట్లదిబ్బ గ్రామాల్లో వరదలు, ఇతర ప్రకృతి విపత్తులపై గురువారం అవగాహన సదస్సులు నిర్వహించారు. కొండపావులూరు (గన్నవరం) నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు నేతృత్వంలో ఆయా గ్రామాల్లో విపత్తులు ముందు జాగ్రత్త చర్యలపై ప్రజలకు అవగాహన కలిగించారు. చేపలవేట సమయంలో జాలర్లు పడిపోతే తోటి మత్స్యకారులు ఎలా రక్షించాలనేది, అలాగే నదిలో వరదకు బోట్ బోల్తా పడినపుడు, నది మధ్య లంకల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించాల్సిన తీరుపై ఎస్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందం డెమో ప్రదర్శించింది. ఈ సందర్భంగా 2300 మంది పేదలకు సింథటిక్ స్లీపింగ్ మ్యాట్స్ పంపిణి చేశారు. తహసీల్దార్ ఆంజనేయప్రసాద్, ఎస్‌డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కిరణ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ కమలేశ్‌సింగ్, నాగాయలంక ఎస్‌ఐ కలిదిండి రాజేష్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, వీఆర్వోలు పాల్గొన్నారు.
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ
11 మందిపై కేసు
పెనమలూరు:కానూరులో 300 గజాల పూర్వార్జిత ఇంటి స్థలాన్ని కొందరు వ్యక్తులు కాజేయటానికి ఏకంగా తహసీల్దార్ గోపాలకృష్ణ సంతకాన్ని ఫోర్జరీ చేయటంతో పోలీసులు 11 మందిపై గురువారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం..... కానూరు గ్రామంలో ఆర్‌ఎస్ నెంబర్లు 249/3,4,5ఎలో 300 చదరపు గజాల ఇంటి స్థలం ఉంది. తహసీల్దార్ గోపాలకృష్ణ ఎండార్స్ చేసినట్లుగా నకిలీ ధ్రువీకరణ పత్రాన్ని కొందరు వ్యక్తులు సృష్టించారు. దీంతో పోలుకొండ వెంకటాచలం అనే మహిళ తన మనవడు కౌశిక్‌కు అనుకూలంగా కంకిపాడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గిఫ్టు డీడ్ (16032/2024) ఇచ్చింది. దీనికి పలువురు వ్యక్తలు సహకరించి ఇంటి స్థలాన్ని అమ్మే యత్నం చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావటంతో తహసీల్దార్ గోపాలకృష్ణ తన సంతకం ఫోర్జరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనకు పాల్పడిన కామోదుల సూరిబాబు, (ఎర్రసూరిబాబు), షేక్.వలి, బోరుగడ్డకుమార్, పోలుకొండ వెంకటాచలం, పోలుకొండ కౌశిక్, బి. వెంకటేశ్వరరావు, వి.లక్ష్మణరావు, వేములపల్లి శ్రీనివాసరావు, పోలుకొండ రాఘవమ్మ, అవనిగడ్డ స్వాతీ, సీవీఎన్‌ఎస్ సూరిబాబులని పోలీసులు విచారణలో నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశారు.
బావిలో గుర్తు తెలియని మృతదేహం
పెనమలూరు:పెనమలూరు గ్రామంలోని ఓ బావిలో గుర్తు తెలియని మృతదేహాన్ని గ్రామస్తులు చూసి గురువారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ ఫిరోజ్ తెలిపిన వివరాల ప్రకారం... పెనమలూరు వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న 15 అడుగుల బావిలో గుర్తు తెలియని వ్యక్తి పడి మృతి చెందాడు. అయితే గ్రామస్తులు మృతదేహాన్ని చేసి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీయటానికి పోలీసులు యత్నిస్తున్నారు. బయటకు తీస్తే మృతుడి వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పారు.