
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం
తేలప్రోలు(గన్నవరం): ఇంజనీర్లు తమ శ్రమ, పట్టుదల, మేధస్సుతో దేశాభివృద్ధికి దోహదపడే మంచి ఫలితాలు సాధించాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు పరిధిలోని ఉషారామ కళాశాలలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు చేతుల మీదుగా బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో నేడు భారతదేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భారత్‌లో ఉన్న యువత ప్రపంచంలోని మరే దేశంలోను లేదన్నారు. అటువంటి యువత దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉన్న సవాళ్లను ఎదుర్కొనేలా మేధస్సుతో పనిచేయాలని సూచించారు. అందుబాటులోకి వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతు నష్టపోతున్నారని, ఇంజినీర్లు వ్యవసాయ రంగంపై దృష్టి సారించాలని కోరారు. మన సాంకేతికతను ఉపయోగించి పంటలు బాగా పండేలా చేయాలని తెలిపారు. ఇంజినీర్లు కేవలం ఉద్యోగాన్వేషణలో ఆగిపోకుండా, ఎవరికి వారు సొంతంగా కాళ్లపై నిలబడేలా పరిశ్రమలు నెలకొల్పాలని చెప్పారు. చదువుతో పాటు డిగ్రీ సంపాదించడమే కాదు, సంస్కారం, విజ్ఞానం సముపార్జించడం ముఖ్యమన్నారు. ఈ దిశగా గత 16 ఏళ్లుగా మంచి విద్యను బోధిస్తున్న ఉషారామ యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. డిగ్రీ పట్టాలు అందుకున్న విద్యార్థుల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. కళాశాల చైర్మన్ సుంకర రామబ్రహ్మం, కార్యదర్శి, కరస్పాండెంట్ సుంకర అనిల్, ప్రిన్సిపాల్ జీవీకేఎస్‌వీ. ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ లంక అరుణ్, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు