
దేవదాయ భూముల పరిరక్షణకు చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం):జిల్లాలో దేవదాయ, ధర్మదాయ శాఖకు సంబంధించిన ఆలయాల భూములను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాల్లో గురువారం దేవదాయ, ధర్మదాయశాఖ, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. తొలుత దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎన్.వెంకటసాంబశివరావు మాట్లాడుతూ పలు దేవాలయాలకు చెందిన భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేశారని, కొన్ని పాస్‌పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. అలాగే కొన్ని భూములు రెవెన్యూ 1బీ రికార్డులో పేర్లు నమోదు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో పెదకళ్లేపల్లి దేవాలయానికి సంబంధించిన భూములతో పాటు శ్రీకాకుళం, పెనమలూరు మండలంలోని పలు దేవాలయాలకు చెందిన భూములు ఆక్రమణలకు గురయ్యాయని వీటిని తమ స్వాధీనంలోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాల్సి ఉందని ఆయన గీతాంజలిశర్మకు వివరించారు. వీటిపై ఆమె మాట్లాడుతూ పాస్‌పుస్తకాలు ఏయే భూములకు సంబంధించి ఏ తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయో తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ తహసీల్దార్‌తో వెంటనే మాట్లాడి పాస్‌పుస్తకాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే 1బి అడంగల్‌లో పేర్లు నమోదు చేసేలా వారికి ఆదేశాలు ఇస్తామని పేర్కొన్నారు. దేవదాయ భూముల్లో ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు సంబంధిత తహసీల్దార్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ఆక్రమణలు తొలగించి భూములు స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీవోలు కె.స్వాతి, జి. బాలసుబ్రహ్మణ్యం, హేళాషారోన్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ