ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు గురువారం బంగారు ముక్కుపుడక, బొట్టు, నత్తును కానుకగా సమర్పించారు. బెంజ్‌సర్కిల్‌లోని ఆచార్యరంగ నగర్‌కు చెందిన పోసాని బసవయ్య, మనోహరమ్మ దంపతులు, వారి కుమారుడు ప్రసాదరావు సుమారు 24.7 గ్రాముల బంగారం, నవ రత్నాలతో తయారు చేయించిన ముక్కుపుడక, బొట్టు, నత్తును ఆలయ అధికారులకు అందచేశారు. సుమారు రూ. 3.05 లక్షలతో బంగారు ఆభరణాలను తయారు చేయించినట్లు దాతలు పేర్కొన్నారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు.
నానో ఎరువులతో బహుళ ప్రయోజనాలు
విజయవాడ రూరల్: నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వినియోగంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నున్న పీఏసీఎస్‌ను గురువారం ఆయన సందర్శించారు. రైతులకు ఎరువుల సరఫరా స్థితిగతులను పరిశీలించారు. ఈ పోస్ మెషిన్ పనితీరు పరిశీలించి, అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలను తెలుసుకున్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణం, గోదాము తనిఖీ చేశారు. ఫిజికల్, ఆన్‌లైన్ రికార్డులు పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ నాగమల్లిక తదితరులు ఉన్నారు.
ముగిసిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలు
గన్నవరం: కేవీఆర్ ఇండోర్ స్టేడియంలో గురువారం కృష్ణాజిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్–19 బాల, బాలికల షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు జరిగాయి. సెలక్షన్స్‌కు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బాలిబాలికలు హాజరయ్యారు. తొలుత పోటీలను జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ అధికారి కె.ఝాన్సీలక్ష్మి ప్రారంభించారు. అనంతరం బాల, బాలికల విభాగాల్లో వేర్వేరుగా పోటీలు నిర్వహించి క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. వీరు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని ఝాన్సీలక్ష్మి తెలిపారు. పోటీలను కేవీఆర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి కేవీఆర్ కిషోర్ పర్యవేక్షించారు. వ్యాయామ ఉపాధ్యాయులు రామారావు, బాలకృష్ణ, చంద్రశేఖర్, నాగరాజు, శాంతికిరణ్, రాంబాబు ఎంపికలు చేశారు.
పేద విద్యార్థుల ఆకలి తీర్చండి
రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్‌రెడ్డి
చిలకలపూడి(మచిలీపట్నం): విద్యార్థులందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సీహెచ్ విజయప్రతాప్‌రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లాలో బుధ, గురువారాల్లో ఆయన వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం ఆయన మచిలీపట్నంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత ఆహారం ఎలా విద్యార్థులు, పిల్లలకు అందిస్తున్నారో దాన్ని పర్యవేక్షించేందుకే ఆహార కమిషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. అందులో భాగంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో అందుతున్న ఆహార పదార్థాలను వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎలా వినియోగిస్తున్నారో పరిశీలించామని చెప్పారు.
ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు అందుతున్నాయో లేదో ఆరా తీశామన్నారు. ప్రస్తుతం వసతి గృహాల్లో సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నారని, అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా సన్నబియ్యం అందజేస్తే బాలలకు పౌష్టికాహారం అందించిన వారమవుతామన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. విద్యార్థులు, బాలలకు ఎటువంటి ఆహార లోపాలు ఉన్నా ఫుడ్ కమిషన్ నంబర్ 94905 51117కు వాట్సాప్ ద్వారా సమాచారం అందివచ్చని చెప్పారు. సమావేశంలో డీఎస్‌వో జి.మోహన్‌బాబు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ షేక్ షాహెద్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

దుర్గమ్మకు కానుకగా బంగారు ముక్కుపుడక, బొట్టు, నత్తు