
దసరా ఏర్పాట్ల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కనకదుర్గనగర్, మహా మండపం, దుర్గాఘాట్ పరిసరాల్లో పర్యటించి దసరా ఉత్సవాల పనులపై ఆలయ అధికారులతో మాట్లాడారు. దసరాపై గత నెల తొలి సమీక్ష సమావేశం నిర్వహించగా, అధికారులు పలు సూచనలు చేశారు. దీంతో గురువారం కలెక్టర్ ఆలయానికి విచ్చేసి కనకదుర్గనగర్ నుంచి మహా మండపం వరకు నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పనులపై అడిగారు. గోశాల వద్ద లడ్డూ పోటు, మహా మండపం వద్ద నిర్మిస్తున్న అన్నదాన భవనం పనులపై ఆరా తీశారు. దసరా నాటికి పనులు ఏ మేరకు జరుగుతాయి, ఉత్సవాల నేపథ్యంలో ఆయా భవనాల వినియోగంపై ఈవో శీనానాయక్, ఈఈ రాంబాబులను అడిగారు. మహా మండపం దిగువన ప్రసాదాల కౌంటర్లను పరిశీలించే క్రమంలో అక్కడ విక్రయిస్తున్న కవర్లను పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కనకదుర్గనగర్, చైనావాల్, రథం సెంటర్ల మధ్య ఆక్రమణలు తొలగించిన తర్వాత చేసిన పనులను కలెక్టర్ పరిశీలించారు.
సకాలంలో వైదిక క్రతువులు
దసరా ఉత్సవాల్లో అమ్మవారికి జరిగే వైదిక క్రతువులు సకాలంలో జరిగేలా చూడాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దుర్గగుడి అధికారులను ఆదేశించారు. దుర్గగుడి మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్‌లో గురువారం దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రామచంద్రమోహన్, ఫెస్టివల్ ఆఫీసర్ భ్రమరాంబ, దుర్గగుడి ఈవో శీనానాయక్‌తో పాటు ఇంజినీరింగ్ అధికారులు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అర్జిత సేవలపై భక్తులలో అనేక గందరగోళాలు ఉన్నాయని, సేవలకు తగిన ప్రణాళిక ఉండాలని సూచించారు.