
ఆయకట్టు చివరికీ సాగునీరు అందాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా కార్యాచరణ రూపొందించాలని ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పంట కాలువలకు సాగునీరు విడుదలపై జలవనరులశాఖ అధికారులతో మంగళవారం సాయంత్రం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జలవనరులశాఖ ఇంజినీరింగ్ అధికారులు రైవస్ కాలువకు 5,200 క్యూసెక్కులు, బందరు కాలువకు మూడు వేల క్యూసెక్కులు, ఏలూరు కాలువకు 1500 క్యూసెక్కులు సాగునీరు విడుదల చేశామని తెలిపారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో చాలా ప్రాంతాల్లో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. రైతులకు ఎలాంటి సాగునీరు సమస్య లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. నిత్యం క్షేత్రస్థాయిలో ఇంజినీరు సహా కిందిస్థాయి సిబ్బంది పంటకాలువల వెంబడి ముమ్మరంగా పర్యటించాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. తాను కూడా పంటకాలువలు పరిశీలిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో జలవనరులశాఖ ఎస్‌ఈ ఆర్.మోహనరావు, ఈఈలు ఆంజనేయప్రసాద్, రవికిరణ్, పలువురు ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ