
కూచిపూడి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించండి
అధికారులకు కలెక్టర్ బాలాజీ ఆదేశం
చిలకలపూడి(మచిలీపట్నం): కూచిపూడి గ్రామ మహిళలు తయారుచేసిన కూచిపూడి నృత్య దుస్తులు, గజ్జెలకు విస్తృతంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ తో కలిసి మంగళవారం సాయంత్రం కూచిపూడి గ్రామ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కూచిపూడి గ్రామంలోని 25 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధిలో భాగంగా కూచిపూడి నృత్య దుస్తులు, గజ్జెల తయారీపై శిక్షణ తీసుకుని ఆ సామగ్రిని తయారుచేస్తున్నారన్నారు. నాట్య గురువులకు తెలియజేసి కూచిపూడి గ్రామ మహిళలు తయారుచేసిన దుస్తులు, గజ్జెలు కొనుగోలు చేసే విధంగా చూడాలన్నారు. అమెజాన్‌తో అనుసంధానమై ఆన్‌లైన్ ద్వారా కూడా అమ్మకాలు జరిపేలా చొరవ చూపాలన్నారు. కూచిపూడి గ్రామాన్ని ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను వచ్చే సమావేశానికి సిద్ధం చేయాలన్నారు. కూచిపూడి గ్రామాన్ని ఆకర్షణీయమైన రంగులు, విగ్రహాలతో సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో మ్యూజియం, ప్రకృతి క్షేత్రాలు, కోనేరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఒక గురుకుల అకాడమీ ఏర్పాటు చేయటంతో పాటు కూచిపూడి మహోత్సవాన్ని నిర్వహించటంలో స్థానికులను ఒప్పించి విడిది గృహాలు కూడా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి గోపాలకృష్ణ, డీఆర్డీఏ పీడీ హరిహరనాఽథ్, ఉయ్యూరు ఆర్డీవో బీఎస్ హేళాషారోన్, జిల్లా టూరిజం అధికారి రామ్‌లక్ష్మణరావు, మొవ్వ ఎంపీడీవో సుహాసిని, తహసీల్దార్ మస్తాన్ పాల్గొన్నారు.