
పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు
కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో సీఎస్‌ఆర్ నిధుల ద్వారా చేపట్టే పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ డీకే బాలాజీ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాల్లో సీఎస్‌ఆర్ నిధుల ద్వారా చేపట్టే పనుల పురోగతిపై సమావేశం నిర్వహించి, మండలాల వారీగా శుక్రవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో నీటిని శుద్ధి చేసే సూక్ష్మ నీటి ఫిల్టర్లను నిర్మించటంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్లు సరైన శ్రద్ధ చూపటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా బీపీసీఎల్, కోల్ ఇండియా తదితర కంపెనీల సీఎస్‌ఆర్ నిధులు సమకూర్చినప్పటికీ నాలుగు నెలలుగా పనులు పురోగతి సాధించకపోవటం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 53 ఫిల్టర్ల నిర్మాణ పనులు రూ. 8.59 కోట్ల వ్యయంతో మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు 25 పనులు మాత్రమే పూర్తి చేశారన్నారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని, మరో ఐదు పనులు ఇంకా ప్రారంభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ బిల్లుల చెల్లింపుల కోసం తన వద్దకు రావటం లేదన్నారు. అసలు పనులు జరుగుతున్నాయా లేదా అని అధికారులను ప్రశ్నించారు. బిల్లులు చెల్లించిన వాటికి వినియోగ ధ్రువీకరణ పత్రాలు సేకరించాలన్నారు. ఇంకా ప్రారంభించని పనులను రద్దు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. వాటి స్థానంలో కొత్త పనులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 702 ఇంకుడు గుంతలు నిర్మాణాలు మంజూరు కాగా అందులో 305 పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. మిగిలిన నిర్మాణాలు కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ, నీటి సౌకర్యం లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ నటరాజు, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, సీపీఓ భీమరాజు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.