
సంక్షేమం గాలికి.. కక్ష సాధింపే లక్ష్యంగా...
అవనిగడ్డ: సంక్షేమ పఽథకాలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా పాలన సాగిస్తోందని విజయవాడ సెంట్రల్ మాజీ శాసన సభ్యుడు మల్లాది విష్ణు విమర్శించారు. అవనిగడ్డ మాజీ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబు స్వగృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కరెంట్‌ని రూ.2.40కి కొనుగోలు చేస్తూ విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడున్న కూటమి పార్టీలు నానా యాగీ చేశాయన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే కరెంట్‌ని రూ.4.60కు ఎలా కొనుగోలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కృష్ణాజిల్లాలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేవారు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఎన్‌టీఆర్ జిల్లాలో చాలా చోట్ల రైతులు కల్తీ విత్తనాలతో నష్టపోయినా, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మల్లాది విమర్శించారు. ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన టీడీపీ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని, అందుకు తిరువూరు ఘటనే నిదర్శన మన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులు ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించినా బుద్ధి తెచ్చుకోవడం లేదన్నారు.
అన్ని పన్నులు పెంచేశారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు, నిత్యావరసర వస్తువులు, నీటి పన్నులు, ఇలా అన్నీ పెంచేశారని, ఇప్పుడు తాజాగా ఆస్తి పన్ను పెంచేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. ప్రజాసమస్యలపై వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజనాల మాణిక్యాలరావు, గరికపాటి కృష్ణారావు పాల్గొన్నారు.
కూటమి పాలనపై మాజీ
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపాటు