
ఆదిదంపతుల ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో ఆదివారం నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో కీలకమైన రూ.25 వేల వస్త్రాలంకరణ సేవలో ఆదివారం ఉభయదాతలు పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి తొలి దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంంటలకు ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చనలో 18 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఖడ్గమాలార్చన అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష అభిషేకాల్లోనూ ఉభయదాతలను అనుమతించారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ఛండీహోమం నిర్వహించగా 51మంది ఉభయదాతలు తమ నామగోత్రాలతో హోమం జరిపించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మూర్తి వద్ద లక్ష కుంకుమార్చన నిర్వహించారు. లక్ష కుంకుమార్చన, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, శ్రీచక్రనవార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ..
ఇక ప్రతి ఆదివారం నిర్వహించే సూర్యోపాసన సేవలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సూర్య భగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆయా సేవల్లో పాల్గొన్న ఉభయదాతలు, భక్తులకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.