పంట మిగల్లేదు.. పరిహారం అందలేదు! | - | Sakshi
Sakshi News home page

పంట మిగల్లేదు.. పరిహారం అందలేదు!

May 26 2025 1:29 AM | Updated on May 26 2025 1:29 AM

పంట మ

పంట మిగల్లేదు.. పరిహారం అందలేదు!

కంటితుడుపు ప్రకటనతో సర్కారు సరి

కంకిపాడు: అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందలేదు. పరిహారం కోసం కొద్ది రోజులుగా రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇంకా పంట నష్టం నమోదు దశలోనే అధికార యంత్రాంగం ఉంది. పంట నష్టం నమోదు సక్రమంగా జరగటం లేదన్న వ్యాఖ్యలు అన్నదాతల నుంచి వినిపిస్తున్నాయి. పంట నష్ట పరిహారంపై కూటమి ప్రభుత్వం కంటితుడుపు ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తోందంటూ రైతులు పెదవి విరుస్తున్నారు.

కృష్ణా జిల్లాలో ఉద్యాన రైతుకు కష్టం..

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్ట పోయారు. చేతికొచ్చిన పంట తడిసిపోయి, నాణ్యత దెబ్బతిని అవస్థలు పడ్డారు. పంట సంరక్షణకు నానా పాట్లు పడ్డారు. దీనికి తోడు విడువకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటుగా మేజర్‌గా పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో సాగులో ఉన్న మొక్కజొన్న పంట ఎండబెట్టి మార్కెట్‌కు తరలించే దశలోనూ, పంట చేను మీద దెబ్బతింది. జిల్లాలో 4,750 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తే ఇంకా 40 శాతం పంట రైతుల వద్ద ఉన్నట్లు సమాచారం. మొక్కజొన్న గింజలు మొలకెత్తి పెట్టుబడులు మొత్తం కోల్పోయే పరిస్థితి నెలకొంది.

తూతూమంత్రంగా..

ఎంత మేరకు పంట నష్టం వాటిల్లిందీ వ్యవసాయశాఖ అంచనాలను నమోదు చేయలేదు. ఈ నెల మొదటి వారంలో కురిసిన వర్షాలకే మొక్కజొన్న దెబ్బతిన్నా, వరి చేలు కోత దశలో నేలవాలినా కనీసం ఎలాంటి నష్టం వాటిల్లలేదంటూ ప్రాథమిక నివేదికలో పేర్కొనటం విడ్డూరం. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలనలు చేయకుండా తూతూమంత్రంగా నివేదికలను సమర్పించి చేతులు దులుపేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పంట దెబ్బతిందని రైతులు ఆర్‌ఎస్‌కేల్లో చెబితే పంట తీసుకొచ్చి చూపండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన సిబ్బంది ఉన్నారంటే రైతులు పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

కోతలు విధిస్తూ..

అయితే ఉద్యానశాఖ మాత్రం జిల్లా స్థాయిలో ప్రాథమికంగా రూపొందించిన పంట నష్టం అంచనాల్లో 127 మంది రైతులకు చెందిన 92.40 హెక్టార్లలో బొప్పాయి, మునగ, కూరగాయలు, తమలపాకు, అరటి పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదించింది. అయితే పంట నష్టం సర్వే అనంతరం 64.337 హెక్టార్లలో అరటి, తమలపాకు, బొప్పాయి, కూరగాయలు పంటలు దెబ్బతిన్నట్లు నివేదించారు. 143 మంది రైతులు నష్టపోయారని, రూ. 19.90 లక్షలు పరిహారం అందించాల్సి ఉందని పేర్కొన్నారు. పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, పామర్రు, బాపులపాడు, ఉంగుటూరు, ఉయ్యూరులో పంట నష్టం జరిగినట్లు నివేదించారు. నష్టం భారీగా ఉంటే కోతలు విధించటం సమంజసమేనా అన్న వాదన రైతులు వ్యక్తం చేస్తున్నారు.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు పరిహారం కోసం ఎదురుచూపులు పంట నష్టం నమోదుపై అభ్యంతరాలు ప్రభుత్వం కాలయాపన చేస్తోందంటూ విమర్శలు

ఆదుకోవడంలో విఫలం..

అకాల వర్షాల అనంతరమే కూటమి ప్రభుత్వం ‘మంగళవారం’ నాటికే పరిహారం రైతుల ఖాతాకు చేరాలని ప్రకటించింది. ఇప్పటికి ఎన్నో మంగళవారాలు గడిచాయి. కానీ రైతులకు మాత్రం పరిహారం అందలేదు. కేవలం కంటి తుడుపు ప్రకటనలకు సర్కారు పరిమితం అయ్యిందని అన్నదాతలు విమర్శిస్తున్నారు. పంట వారీగా సమర్థంగా పంట నష్టం నమోదు చేసి బాధిత రైతులకు పరిహారం అందేలా చేయటంలో అటు సర్కారు, ఇటు అధికారులు కూడా విఫలమయ్యారంటూ ఆరోపిస్తున్నారు.

పంట మిగల్లేదు.. పరిహారం అందలేదు! 1
1/1

పంట మిగల్లేదు.. పరిహారం అందలేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement