
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
మచిలీపట్నంటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని 38వ డివిజన్లో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న పట్టణ ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి బుధవారం మంత్రి రవీంద్ర శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రధానంగా ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు. ఈ కేంద్రం నిర్మాణం పూర్తయితే పరిసర ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి, ముఖ్యంగా డయాలసిస్ రోగులకు చాలా ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల అనుసంధానంగా ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామన్నారు. వైద్య కళాశాలలో ఫిజికల్ ఫిట్నెస్ కేంద్రం ఏర్పాటుకు రూ.12 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచామని త్వరలో పనులు మొదలవుతాయన్నారు. పేద ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు రూ.3 కోట్లను ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు అందజేశామన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ఈ ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తయ్యాక పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శర్మిష్ట, మునిసిపల్ డీఈ కుబియా నాయక్, ఏఈ రాజేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకష్ణ, కొనకళ్ళ బుల్లయ్య అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర