
రాజ్యాధికారంతోనే అణగారిన వర్గాల అభివృద్ధి
చల్లపల్లి: జీవన విధానంలోని వ్యత్యాసాలను రూపుమాపాలన్నా, అణగారిన వర్గాలు అభివృద్ధి పథంలో నడవాలన్నా రాజ్యాధికారం ఒక్కటే మార్గమని, అందుకోసమే బహుజన సమాజ్ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ అన్నారు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అన్న నినాదంతో ప్రధాన రహదారి వెంట ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక షాదీఖానాలో సంకల్ప సభ నిర్వహించారు. తొలుత జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, కాన్షీరామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గుంటూరు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో గౌతమ్ మాట్లాడుతూ సమాజంలో 25 శాతం ఉన్న ఎస్సీలు కేవలం మూడు శాతం మాత్రమే ఉన్న అగ్రవర్ణాల వారికి రాజ్యాధికారం కట్టబెట్టడం ఎంతవరకూ న్యాయమో ఆలోచించాలని కోరారు. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజ్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఇంకా అణగారిన వర్గాల వారి గృహాలు ఊరి బయటే ఉంటున్నాయని అన్నారు. జిల్లా అధ్యక్షుడు గుంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలంలో బీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేయడానికి అందరూ ఐకమత్యంగా కలిసి రావాలని కోరారు. అనంతరం గౌతమ్‌కుమార్‌ను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రవీంద్ర, దొండపాటి శామ్యూల్, బోసుబాబు, వెంకటేశ్వరరావు, మరియబాబు, బాలాజి, పెద్ద సంఖ్యలో బీఎస్పీ కార్యకర్తలు, సానుభూతిపరులు పాల్గొన్నారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు
బందెల గౌతమ్ కుమార్