
రైల్వే హాస్పిటల్‌లో నేరస్తుల సామాజిక సేవ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లు, రైల్వే స్టేషన్ పరిసరాల్లో చిన్న, చిన్న నేరాలకు పాల్పడిన నేరస్తులకు రైల్వే కోర్టు న్యాయమూర్తి ఆర్.వి శర్మ భారత న్యాయ సురక్షా సంహిత్‌ను అనుసరించి 133 మంది నేరస్తులకు జరిమానాతో పాటు సమాజ సేవా చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఆర్‌పీఎఫ్ పోలీసులు పర్యవేక్షణలో 133 మంది నేరస్తులు విజయవాడ రైల్వే హాస్పటల్ ప్రాంగణంలో రోగులకు మజ్జిగ సరఫరా చేశారు. అనంతరం హాస్పటల్ పరిసరాలను శుభ్రపరిచారు. ఇటువంటి శిక్షలు విధించడంతో వారిలో పరివర్తన, సామాజిక బాధ్యత తెలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
22న జెడ్పీ సర్వసభ్య సమావేశం
చిలకలపూడి(మచిలీపట్నం):ఈ నెల 22వ తేదీన జిల్లా పరిషత్ స్థాయీ సంఘాలు, సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్ సీఈవో ఆర్‌సీ ఆనంద్‌కుమార్ శనివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఏడు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం 11 గంటలకు జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో సర్వసభ్య సమావేశం నిర్వహణ ఉంటుందని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్రతో పాటు శాసనసభ్యులు, ఇతర ప్రత్యేక ఆహ్వానితులు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారులు హాజరవుతారని తెలిపారు.