
కొండపల్లి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పర్యాటకులకు మధురానుభూతిని కల్పించేలా కొండపల్లి ఖిల్లా, కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రాలను అభివృద్ధి చేయడంతో పాటు ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కొండపల్లి బొమ్మల తయారీ కాలనీ వద్ద ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు, కొండపల్లి ఖిల్లా అభివృద్ధి పై గురువారం కలెక్టర్ లక్ష్మీశ పర్యాటక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండపల్లిలో సుమారు 400 ఏళ్లకు పైగా రాజస్థాన్‌కు చెందిన హస్త కళాకారులు అత్యంత కళానైపుణ్యంతో తయారు చేసిన బొమ్మలకు జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. కొండపల్లి పరిసర ప్రాంతాలలో లభ్యమయ్యే తెల్ల పొణికి చెక్కతో రూపొందించే కొండపల్లి బొమ్మలకు మరింత ప్రాచుర్యం కల్పించి కళాకారులను ప్రోత్సహించడం ద్వారా జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా శతాబ్దాల చారిత్రక వారసత్వానికి సజీవ సాక్ష్యంగా ఉన్న కొండపల్లి బొమ్మల విశిష్టతను పర్యాటకులకు చాటిచెప్పేలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. భవనంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసి, సుందరీకరణ పనులు చేపట్టి ఆకర్షణీయంగా తీర్చిదిదేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొండపల్లి బొమ్మల కాలనీ నుంచి ఖిల్లా వరకు ఉన్న మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులకు అనువుగా తీర్చిదిద్దాలన్నారు. కొండపల్లి వద్ద పర్యాటకులు ట్రెక్కింగ్ నిర్వహించుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఎస్.పద్మారాణి, టూరిజం కన్సల్టెంట్ సాహితి, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డీఈ శ్రీనివాస యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ