
గృహనిర్మాణాలపై ప్రత్యేక దృష్టి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి ఈ నెల 22వ తేదీ నాటికి 910 గృహాలను పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ అధికారులను ఆదేశించారు. జెడ్పీ సమావేశపు హాలులో మంగళవారం సాయంత్రం గృహ నిర్మాణ పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. గృహ నిర్మాణంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలో చాలా వెనుకబడి ఉందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో 10 వేల గృహాలు నిర్మాణం పూర్తిచేయాల్సి ఉందన్నారు. ఏప్రిల్ 16న కలెక్టర్ సమీక్షించినప్పుడు రూఫ్ లెవల్‌లో 506, పై కప్పు స్థాయిలో 2,033 గృహాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు పురోగతిని పరిశీలిస్తే కేవలం 237 గృహాలు మాత్రమే పూర్తి చేశారని ఇలా ఉంటే లక్ష్యాలను ఎప్పటికి సాధిస్తారని ఆమె ప్రశ్నించారు. ఇకనైనా ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ పెండింగ్‌లో ఉన్న లేఅవుట్లలో లబ్ధిదారులు, ఇంజినీరింగ్ సహాయకులతో సమావేశం నిర్వహించి 22వ తేదీ నాటికి 910 గృహాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రూ.72 లక్షలు మాత్రమే వినియోగించారు
జిల్లాకు రూ.13 కోట్ల అదనపు ఆర్థిక సాయంగా నిధులు విడుదలైనా ఇప్పటి వరకు కేవలం రూ.72లక్షలు మాత్రమే వినియోగించారన్నారు. ఉన్నతాధికారులు 15 రోజులకు ఒకసారి గృహనిర్మాణ పురోగతిపై సమీక్షిస్తున్నారని జిల్లాలో ప్రగతి లేకపోవడంతో తాము సమాధానం చెప్పడానికి ఇబ్బంది కలుగుతోందన్నారు.
ఇకపై క్షేత్ర స్థాయిలో అధికారులు వారానికి మూడుసార్లు గృహనిర్మాణంపై సమీక్షించాలన్నారు. ప్రతిరోజూ తాను టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తానన్నారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ అధికారి వెంకట్రావు, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, ఏపీఎంఐపీ పీడీ విజయలక్ష్మి, డీటీడబ్ల్యూవో ఫణిదూర్జటి, బీసీ సంక్షేమ శాఖాధికారి జి. రమేష్, డెప్యూటీ సీఈవో ఆనంద్‌కుమార్, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ