
ట్రాక్టర్‌పై నుంచి జారిపడి డ్రైవర్ మృతి
గూడూరు: మట్టి ట్రాక్టర్‌పై నుంచి జారిపడిన డ్రైవర్ మరణించిన ఘటన సోమవారం మండల పరిధిలోని మల్లవోలులో చోటు చేసుకుంది. మల్లవోలు శివారు ముదిరాజుపాలెం గరువుకు చెందిన పూల నరసింహ(25) ట్రాక్టర్ డ్రైవర్. వారం రోజులుగా రాయవరం పొలిమేర నుంచి చటారిపాలెంకు ట్రాక్టర్లతో మట్టి తోలకానికి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం చటారిపాలెం మట్టి డంప్ చేసి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్‌పై నుంచి జారి పడిపోయాడు. అతని నడుంపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. నరసింహను తొక్కుకుంటూ వెళ్లిన ట్రాక్టరు చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. వెనుక వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు నరసింహ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలీ పనులు చేసుకుని జీవించే పూల శ్రీనుకు ఇద్దరు కుమారులు వారిలో నరసింహ పెద్దవాడు. తన కుమారుడికి పెళ్లి కూడా కాలేదంటూ.. అతను దుర్మరణం చెందడంపై శ్రీను కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.