
ముగిసిన గడువు.. పూర్తికాని ఈకేవైసీ
పెడన: రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకునే గడువు ముగిసినా.. లక్ష్యం పూర్తి కాలేదు. ఈకేవైసీ చేయని కార్డుదారుల పేర్లు తొలగిస్తారని తెలుస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను సవరించి పారదర్శక సేవలు అందిస్తామని అంటూనే ప్రజాభారం తగ్గించుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేషన్‌కార్డుల్లో సభ్యులను తొలగించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డులో ఎంత మంది కుటుంబ సభ్యులుంటే అందులోని వారంతా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించింది. దీనికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుని సంబంధిత రేషన్ డీలర్ల ద్వారా ఈకేవైసీ చేయించారు. దీని గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. అయినా వందశాతం పూర్తి కాకపోవడంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్థానిక అధికారులు వేచి చూస్తున్నారు.
19,905 యూనిట్లకు ఈకేవైసీ చేయాలి
ప్రస్తుతం ఇప్పటి వరకు మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో 3,79,692 యూనిట్లు ఉంటే వీటిల్లో 3,59,787 యూనిట్లు ఈకేవైసీ పూర్తయ్యాయి. మిగిలిన 19,905 యూనిట్లు ఈకేవైసీ కావాల్సి ఉంది.
వీరు అడ్రస్‌లలో లేరా లేక స్థానికంగా నివాసం ఉండటం లేదా అనేది తేలాల్సి ఉంది. అదీ కాకుండా వీరి పేరుతో ప్రతి నెలా రేషన్ కూడా పంపిణీ అవుతుందా లేదా అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యులను బట్టి యూనిట్లుగా విభజించారు. ఒక్కో కార్డులో ఒకటి నుంచి ఐదుగురు సభ్యులు వరకు ఉన్నారు. ఐదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేయించాల్సి ఉంది.
ఈకేవైసీ చేయని కార్డుదారుల పేర్లు తొలగింపు! పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో 3.79 లక్షలు యూనిట్లు ఇప్పటి వరకు రూ.3.59 లక్షలు ఈకేవైసీ పూర్తి మరో 19 వేల యూనిట్లు పరిస్థితి ఏంటో..
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో
యూనిట్లును పరిశీలిస్తే...
మండలం మొత్తం ఈకేవైసీ ఈకేవైసీ
యూనిట్లు అయినవి కానివి
మచిలీపట్నం 1,93,322 1,81,618 11,704
పెడన 57,797 55,148 2,649
గూడూరు 44,334 42,718 1,616
బంటుమిల్లి 40,355 38,471 1,884
కృత్తివెన్ను 43,884 41,832 2,052
మొత్తం 3,79,692 3,59,787 19,905