
19 నుంచి ‘పది’ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
చిలకలపూడి(మచిలీపట్నం): పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో విద్య, వైద్య, ఏపీఎస్ ఆర్టీసీ, పోలీసు, పోస్టల్, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో పది అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఆయా శాఖలు సమన్వయం చేసుకుంటూ పరీక్షల నిర్వహణకు అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,544 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్, కస్టోడియన్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను ఇప్పటికే నియమించారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, వాటికి సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరవకుండా చూడాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద ముఖ్యమైన ఔషధాలతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను వైద్య సిబ్బంది సిద్ధంగా ఉంచాలన్నారు.
అన్ని ఏర్పాట్లు చేయండి
పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యం లేకుండా నిరంతరాయ విద్యుత్, ఆయా రూట్లలో విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పరీక్షలకు సమాంతరంగా 14 పరీక్ష కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలు కూడా జరుగుతాయని, మొత్తంగా 2,307 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో డీఈవో పీవీజే రామారావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, మచిలీపట్నం ఆర్డీవో కె.స్వాతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
30 పరీక్ష కేంద్రాలు జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖర రావు