
జల్లు స్నానాలకూ అవకాశం లేదు !
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సార్ కృష్ణా నదిలో నీళ్లు అడుగు ఎత్తు కూడా లేవు.. కనీసం జల్లు స్నానాలు చేసేందుకు కూడా అవకాశం లేకుండా ఉందని పలువురు భక్తులు దుర్గాఘాట్‌లో పుణ్యస్నానాల గురించి ఈవో వీకే శీనానాయక్ ఎదుట ఏకరువు పెట్టారు. నదీ తీరంలో ఉన్నా తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. కృష్ణమ్మ చెంతనే ఉన్నా భక్తులు నీళ్లు కొనుక్కొవాల్సి వస్తుందని మరో మహిళా భక్తురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సార్ బట్టలు మార్చుకునేందుకు గదులు కట్టారు.. అందులో క్షణం కూడా ఉండలేని పరిస్థితి.. ఉక్కపోతతో అల్లాడుతున్నామని.. కనీసం గదులకు మరమ్మతులు చేయించాలని మరో భక్తురాలి విన్నపం... దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ దుర్గాఘాట్, కేశ ఖండనశాల, హెడ్ వాటర్ వర్క్స్ వద్ద కొండ ప్రాంతం, శివాలయం, యాగశాల, నూతన పూజా మండపాలు, జమ్మిదొడ్డిలోని దేవస్థాన భవనాలను శనివారం పరిశీలించారు.
ఒకరిపై మరొకరు..!
దుర్గాఘాట్‌కు చేరుకున్న ఈవో శీనానాయక్‌కు పుణ్యస్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. నదీలో నీటి మట్టం తగ్గినా జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేయలేదు సార్ అని వివరించగా, ఈవో దానిపై ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. అయితే షవర్లకు నీటిని పంపింగ్ చేసేందుకు విద్యుత్ సదుపాయం లేదని చెప్పారు. దీంతో ఎలక్ట్రికల్ విభాగం సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆలయ ఎలక్ట్రికల్ సిబ్బంది విద్యుత్ లైన్లను పరిశీలించగా, మోటార్లు పని చేయడం లేదని తేలింది. ఇదే విషయాన్ని ఈవో దృష్టికి తీసుకువెళ్లగా, అసలు వేసవి కాలం మొదలైన తర్వాత మోటార్లను తనిఖీ చేశారా అని ప్రశ్నించారు. మరో భక్తురాలు స్నానఘాట్‌లో తాగునీటి ఇబ్బంది గురించి ఫిర్యాదు చేశారు. నదీ తీరం పక్కనే ఉన్నా తాగేందుకు నీళ్లు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈవో ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా స్నానఘాట్‌లో పూజా సామగ్రి విక్రయించే వారు అధిక ధరలకు విక్రయిస్తున్నారని గుర్తించారు. దుస్తులు మార్చుకునే గదులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
పూజా మండపం,
యాగశాల పరిశీలన
అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న పూజా మండపం, యాగశాలలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఈవో శీనానాయక్ ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలోని నూతన నిర్మాణాలతో పాటు మరమ్మతులకు గురైన అర్చక క్వార్టర్స్, వాటర్ ట్యాంక్‌లను పరిశీలించారు. వాటర్ ట్యాంక్‌లను ఎప్పుడు శుభ్రం చేసింది వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం దుర్గాఘాట్‌కు ఎదురుగా ఉన్న కేశ ఖండన శాలను పరిశీలించి ప్రతి నిత్యం ఎంత మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారు.. తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈవో వెంట ఈఈలు కోటేశ్వరరావు, వైకుంఠరావు, ఏఈలు కుటుంబరావు, మస్తాన్‌రావు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నదీ తీరం పక్కనే ఉన్నా తాగేందుకు నీళ్లు లేవు
దుర్గాఘాట్‌లో సమస్యలపై ఈవోకు భక్తుల ఏకరువు
దుస్తులు మార్చుకునే గదుల్లో మార్పులు చేయాలి

జల్లు స్నానాలకూ అవకాశం లేదు !