
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ నందు ఏపీ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా జరిగింది. సమాన పనికి సమాన వేతనం, కార్మికులను పర్మినెంట్ చేయాలని నినాదాలు చేశారు. ధర్నాలో పాల్గొన్న యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.కోటేశ్వరరావు గౌడ్, గౌరవాధ్యక్షుడు గుంటుపల్లి శేషగిరిరావు మాట్లాడుతూ.. అత్యవసర విభాగాలైన నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రెయినేజీ, పార్క్‌లు, మెకానిక్‌లు, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అన్ని విభాగాల్లో పనిచేస్తున్న టెక్నికల్ సిబ్బందికి రూ.29,200లు, నాన్ టెక్నికల్ సిబ్బందికి రూ.24,500లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల సర్వీసు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు.
ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి..
కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్‌ను రద్దు చేస్తే కార్మికులందరిని పర్మినెంట్ చేయాలన్నారు. కార్మికుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, ఇతర ఉద్యోగుల మాదిరిగా గ్రాట్యుటీ, కనీస పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలి, ఆదివారాలు, దేశ, జాతీయ పండుగలకు సెలవు దినాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో యూనియన్ సమన్వయ కార్యదర్శి బత్తుల శివశంకర్, నగర అధ్యక్షుడు పిట్టా మహేష్, కార్యదర్శి ఎండీ గౌస్, ఉపాధ్యక్షులు బుచ్చిబాబు, వి.జైపాల్, బి.నాగరాజు, నాయకులు సాంబశివరావు, విష్ణుప్రసాద్, శివాజీ, బి.విజయ్, ఎన్.దుర్గారావు పాల్గొన్నారు.
కొంకేపూడి పవర్ ప్లాంట్, ఓఎన్‌జీసీల పరిశీలన
పెడన: భారత్, పాక్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడంతో పెడన మండలంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కొంకేపూడి పవర్‌ప్లాంట్, నందిగామ ఓఎన్‌జీసీ కార్యాలయాలను పెడన అధికారులు పరిశీలించారు. పెడన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేంద్రబాబు, ఇన్‌చార్జి తహసీల్దార్ కె.అనిల్‌కుమార్‌లతో పాటు పెడన ఎస్‌ఐ జి.సత్యనారాయణ ఆయా ప్రాంతాల్లోని అధికారులు, సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. పవర్‌ప్లాంట్ పనులు ఇంకా ప్రారంభించలేదని అధికారులు పేర్కొనడంతో అయినా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే నందిగామ ఓఎన్‌జీసీ వద్ద నిఘా పెంచాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.

మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి