
అనుమానాస్పద రీతిలో వివాహిత మృతి
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఘటనపై మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహంతిపురం జాడ పాపయ్య వీధిలో కట్టా హేమంత్‌కుమార్, స్రవంతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిది ప్రేమ వివాహం కాగా ఒక బాబు సంతానం. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో అదే వీధిలో ఉండే స్రవంతి తండ్రి పోతురాజు సర్ది చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన భార్యభర్తలిద్దరికీ గొడవ జరగ్గా పోతురాజు కుమార్తె ఇంటికి వెళ్లి సర్ది చెప్పి తిరిగి తన ఇంటికి వచ్చేశాడు. గురువారం తెల్లవారుజామున స్రవంతి నాలుగేళ్ల కుమారుడు తాతయ్య వద్దకు వచ్చి అమ్మ కదలడం లేదని చెప్పాడు. దీంతో పరుగు పరుగున కుమార్తె ఇంటికి వెళ్లే సరికి లోపల ఫ్యాన్ హుక్‌కు చున్నీతో ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతురాలి ఇంటికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. తండ్రి పోతురాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.